నెల్లూరు జిల్లా సహా పరిసర జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు జలాశయాల్లో భారీగా వరద నీరు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు దిగువన ఉన్న జలాశయాల్లోకి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు సోమశిలకు వరదనీరు పోటెత్తడంతో మొత్తం 11 గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 3,90,000 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 5,20,000 క్యూసెక్కులుగా ఉంది. భారీగా వరదనీరు కిందకు వదలడంతో సోమశిల పరివాహక ప్రాంతం కోతకు గురవుతోంది.


సోమశిల ప్రాజెక్ట్ పక్కనే ఉన్న శివాలయంలోకి కూడా వరదనీరు వచ్చి చేరింది. ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే సందర్భంలో శివాలయంలోకి నీరు రావడం అరుదు. అయితే ఈ దఫా ఒకేసారి 5లక్షల పైగా క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేస్తుండటంతో వరదనీరు శివాలయాన్ని ముంచెత్తింది. 


భారీగా వరదనీరు కిందకు విడుదల చేస్తుండటంతో పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు. వరద ప్రవాహాన్ని క్రమక్రమంగా పెంచుకుంటూ వస్తున్నందున ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పుడు ప్రాజెక్ట్ కి ఉన్న 12 గేట్లలో ఒకటి మినహా మిగతా 11 గేట్లు ఎత్తేయడంతో ప్రవాహం మరింత పెరిగింది. 


సోమశిల ప్రాజెక్ట్ నుంచి భారీగా నీరు వదలడంతో సంగం వద్ద పెన్నా ఉరకలెత్తింది. సమీప గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. ఇప్పటికే వీర్లగుడిపాడు గ్రామాన్ని ఖాళీ చేయించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడ సహాయక చర్యలు చేపట్టాయి. అటు ఆత్మకూరు-సంగం వద్ద జాతీయ రహదారిపైకి పెన్నా నీరు చేరింది. రహదారి మొత్తం నీరే కనిపిస్తోంది. 


పెన్నాకు వరదనీటి ఉధృతి పెరిగి.. నీరంతా రోడ్లపైకి రావడంతో.. సంగం వద్ద జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలసి ముంపు ప్రాంతాల వాసుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. హైవే పక్కన దాబాలలో ఉండే సిబ్బంది కొంతమంది తాము అక్కడినుంచి వెళ్లేది లేదని చెబుతుండటంతో వారిని ఒప్పించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు పోలీసులు. 


నెల్లూరుకి రెడ్ అలర్ట్.. 
పెన్నా వరద ప్రభావం నెల్లూరు నగరంపై ఎక్కువగా ఉంటుంది. పెన్నా తీరంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నవారు వరద ప్రభావంతో భయపడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు వచ్చి చేరుతుందని ఆందోళనకు గురవుతున్నారు. అటు పెన్నా నగరం సమీపంలో వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. పెన్నా వంతెనల కింద వరద ప్రవాహాన్ని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపిస్తున్నారు. వరదనీరు మరింత పెరిగే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.