భారీ వర్షాలకు నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ చూడని విచిత్రాలన్నీ జరుగుతున్నాయి. గతంలో పలానా చెరువు నిండిందని చెబితే విన్న ఆనవాళ్లే కానీ కళ్లముందు ఆయా చెరువులు నిండిన దాఖలాలు ఎప్పుడూ లేవు. ఉదయగిరి, కలిగిరి, వింజమూరు, ఉప్పలపాడులో ఉన్న చెరువులు, కుంటలు కూడా ఈసారి నిండు కుండల్లా మారాయి. సోమశిల ప్రాజెక్ట్ నుంచి నిరంతరాయంగా నీరు విడుదల చేస్తూనే ఉన్నారు. అటు కండలేరు ప్రాజెక్ట్ కూడా నిండు కుండలా మారింది. దీంతో కిందకు నీటిని విడుదల చేస్తున్నారు. జిల్లాలోని అన్ని నీటి వనరులు కూడా పూర్తి స్థాయిలో జలకళను సంతరించుకున్నాయి. 


గతంలో ఎంత వర్షం కురిసినా, ఎన్ని తుపాన్లు వచ్చినా రాకపోకలకు అంతరాయం ఉండేది కాదు. కానీ ఈసారి రాకపోకలకు అంతరాయం కలిగేట్లు కొన్ని ప్రాంతాల్లో వరదనీరు రోడ్లపైకి పోటెత్తింది. చాలా ప్రాంతాల మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఏకంగా హైవేకు గండిపడింది. మరో హైవేపై దాదాపు 10గంటలు రాకపోకలు నిలిచిపోయాయి. 


సంగం కొండపై ఎప్పుడూ జలధారలు కిందకి పడలేదు. ఈసారి వర్షాలకు భూతాపం పూర్తిగా తగ్గిపోయింది. కొండపైనుంచి తొలిసారి జలపాతం కిందకు ఉరకలెత్తింది. కొత్త కొత్త జలాపాతాలన్నీ ఈ సారి స్థానికులకు కనువిందు చేస్తున్నాయి. 


పాతాళ గంగ పైపైకి.. 
ముఖ్యంగా పాతాళ గంగ పైపైకి వచ్చి చేరుతోంది. మర్రిపాడు, అనంతసాగరం, ఏఎస్ పేట, ఆత్మకూరు ప్రాంతాల్లో బోర్లలో నీరు ఉబికి వస్తోంది. గతంలో ఎండిపోయిన బోర్లు ఇప్పుడు జలకళ సంతరించుకున్నాయి. మోటర్ వేయకపోయినా నీరు పైకి వచ్చేస్తోంది. దీంతో స్థానికులు సైతం ఆశ్చర్యపోతున్నారు. 




మర్రిపాడు మండలంలోని పడమటినాయుడు పల్లి, పల్లవోలు గ్రామంలో బోర్లనుంచి నీరు ఉబికి వస్తోంది. దీన్ని స్థానికులు వింతగా చూస్తున్నారు. మండలంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఎండిపోయిన బోర్లలో ఇప్పుడు నీటి జాడలు కనిపిస్తున్నాయని అంటున్నారు స్థానికులు. గతంలో అక్కడక్కడా నీటి పొరల సర్దుబాటు కారణంగా ఇలాంటి సంఘటనలు జరిగేవి. అయితే ఇటీవల నెల్లూరు జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ఇలాంటి వింతలు, విశేషాలు నిత్యకృత్యం అయ్యాయి. 


అనంతసాగరం మండలంలో చేతి పంపులనుంచి కొట్టకండానే నీటి ధారలు వస్తున్నాయి. ఇదెక్కడి విడ్డూరం అంటూ స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఎండాకాలంలో నీరు రావడం కష్టమైపోతుందని, అలాంటిది ఇప్పుడు కొట్టకుండానే నీరు వస్తోందని చెబుతన్నారు. దాదాపుగా భూగర్భ జలాలు దండిగా పెరిగిపోయాయి. మరో రెండు మూడేళ్ల వరకు నెల్లూరు జిల్లాలో నీటి కరవే ఉండదని అంటన్నారు నిపుణులు. ఆ స్థాయిలో ఇక్కడ వర్షపాతం నమోదైంది, నెల్లూరు జిల్లా జలసిరి సంతరించుకుంది.