పూర్తిగా 25 గడపలు కూడా లేని చిన్న పల్లెటూరు. దాదాపుగా ఊరంతా సోమశిల ప్రాజెక్ట్ నిర్వాశితులే. కడప జిల్లానుంచి వలస వచ్చి ముప్పయ్యేళ్ల క్రితం ఇక్కడ సెటిలయ్యారు. ఆ ఊరినుంచి ఇప్పుడో కుర్రాడు అమెరికా జాబ్ కి సెలక్ట్ అయ్యాడు. ఏడాదికి జీతం కోటీ 20లక్షలు. కలలో కూడా తల్లిదండ్రులు ఊహించలేదు, చదువుకునే సమయంలో ఆ కుర్రాడు కూడా ఆ ఘనత సాధిస్తాననుకోలేదు. కానీ చదువుపై ఉన్న శ్రద్ధ, పట్టుదల అతడిని ఆ ఘనతకు దగ్గర చేశాయి. 


నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం పాత జంగాలపల్లి గ్రామంలో నివశించే మనోహర్ రెడ్డి లక్ష్మీదేవి దంపతుల కుమారుడు ఈగ వెంకటసాయికృష్ణారెడ్డి టాక్ ఆఫ్ ది ఏపీగా మారాడు. ఐఐటీ ఖరగ్‌ పూర్‌ లో బీటెక్ పైనల్ ఇయర్ చదువుతున్న సాయికృష్ణారెడ్డి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఇంటెల్ కంపెనీలో కోర్ సైడ్ జాబ్ సాధించాడు. ఈసీఈ గ్రూప్ లో 92 శాతం మార్కులు సాధించిన సాయికృష్ణారెడ్డికి దాదపు ఐదు ఉద్యోగాలు వచ్చాయి. వీటిలో ఇంటెల్ ఉద్యోగాన్ని సెలక్ట్ చేసుకున్నాడు. త్వరలో అమెరికా వెళ్లబోతున్నాడు. 


డిగ్రీ చదివిన తండ్రి ఉపాధికోసం కువైట్ వెళ్లి తిరిగొచ్చి ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నాడు. తమ కొడుక్కి చదువుపై ఉన్న ఆసక్తితో ఐఐటీ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పించారు. వారి ప్రోత్సాహానికి తగ్గట్టుగానే ఐఐటీలో ర్యాంక్ సాధించి ఖరగ్ పూర్ లో బీటెక్ చదివాడు సాయికృష్ణారెడ్డి. ఇప్పుడు తమకే కాదు, తమ ఊరికి కూడా మంచి పేరు తెచ్చాడని సంతోషపడుతున్నారు తల్లిదండ్రులు. 




కోటీ 20 లక్షల జీతంతో కొలువు సాధించినా తనకు సివిల్స్ పైనే దృష్టి ఉందంటున్నాడు సాయికృష్ణారెడ్డి. అమెరికా వెళ్లి కొన్నాళ్లు ఉద్యోగం చేసినా, ఆ తర్వాత భారత్ కి తిరిగొచ్చి సివిల్స్ సాధిస్తానని, ఐఏఎస్ అవుతానని ధీమాగా చెబుతున్నాడు. ఆ ఊరిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్న యువకులను ఆదర్శంగా తీసుకున్నానని చెబుతున్న సాయికృష్ణారెడ్డి, ఆ ఊరినుంచి ఐఐటీకి ఎంపికైన తొలి విద్యార్థి, ఆ ప్రాంతం నుంచి అమెరికాకి ఉద్యోగం కోసం వెళ్తున్న అతి పిన్న వయస్కుడు. 




అక్కడే ఆగిపోయి ఉంటే..
సాయికృష్ణారెడ్డికి ఇంటర్ తర్వాత ఐఐటీ ఎంట్రన్స్ లో మంచి ర్యాంక్ రాలేదు. రాష్ట్రంలోని ఎన్ఐటీల్లో సీటు వచ్చినా అతను సంతృప్తి చెందలేదు. మరో ఏడాది  కష్టపడ్డాడు. ఐఐటీ ఎంట్రన్స్ కోసం ఏడాది లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాడు. చివరకు అనుకున్నది సాధించాడు. లాంగ్ టర్మ్ తర్వాత ఐఐటీ ఖరగ్ పూర్ లో సీటు తెచ్చుకున్నారు. ప్రత్యేకించి ఈసీఈ బ్రాంచ్ లో చేరేందుకు ఆసక్తి చూపించాడు. ఈసీఈలో చేరితే సాఫ్ట్ వేర్ కుదరకపోతే హార్డ్ వేర్ సైడ్ వెళ్లొచ్చని ఆలోచించాడు. అందుకే ఐఐటీ మద్రాస్ లో చేరేందుకు అతను ఆసక్తి చూపించలేదు. ఈసీఈ సీటుకోసం ఖరగ్ పూర్ వెళ్లాడు. అక్కడ కూడా భాష సమస్య అయినా కూడా దాన్ని అధిగమించి చదువుకున్నాడు. సాఫ్ట్ వేర్ కోసం వేచి చూడకుండా హార్డ్ వేర్ ఉద్యోగం సాధించాలనుకున్నాడు. 


ఐఏఎస్ లక్ష్యం..
ఇప్పుడు ఐటీ ఉద్యోగంలో చేరినా తన లక్ష్యం మాత్రం ఐఏఎస్ అంటున్నాడు సాయికృష్ణారెడ్డి. తన జీవితాశయాన్ని కచ్చితంగా సాధిస్తానని అంటున్నాడు. తన ద్వారా కుటుంబం పేరు, తమ గ్రామం పేరు వెలుగులోకి రావడం సంతోషంగా ఉందని చెబుతున్నాడు.