Nellore Court Theft : నెల్లూరు కోర్టులో చోరీ ఘటనపై మంగళవారం హైకోర్టు సుమోటో విచారణ చేపట్టింది. కేసును సీబీఐకి అప్పగించడంపై అభ్యంతరం లేదని విచారణలో భాగంగా అడ్వకేట్ జనరల్(ఏజీ) కోర్టుకు తెలిపారు. దీంతో డీజీపీ, మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, సీబీఐ డైరెక్టర్, సీఎస్ లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణ కోర్టు వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేసింది.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి నివేదిక ఆధారంగా
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నిందితుడిగా ఉన్న కేసు ఆధారాలు నెల్లూరు నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి చోరీకి గురైన ఘటన సంచలనమైంది. ఈ ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు సవ్యంగా జరగడం లేదని, స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ఆధారంగా ఉన్నత న్యాయస్థానం సుమోటో పిల్‌గా పరిగణించి మంగళవారం విచారణ జరిపింది.
ఏం జరిగిందంటే?
నెల్లూరు కోర్టులో జరిగిన దొంగతనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. ఓ కేసులో కీలక సాక్ష్యాలు మాయం చేయడం కోసమే దొంగలు పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. నెల్లూరు 4వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో దొంగతనం జరిగింది. ఓ కీలక కేసులో సాక్ష్యాధారాలుగా ఉన్న కొన్ని డాక్యుమెంట్లు, ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లు చోరీకి గురైనట్టు తెలుస్తోంది. దీనిపై నెల్లూరు చిన్నబజారు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
కోర్టులోనే దొంగతనం
దొంగతనానికి గురైన సంచిని కోర్టు బయట ఉన్న కాలువలో గుర్తించిన పోలీసులు పరిశీలించారు. ఆ సంచిలో ఉండాల్సిన పలు కీలక డాక్యుమెంట్లు మాయమైనట్లు గుర్తించారు. వెంటనే విచారణ చేపట్టారు. కోర్టు ఆవరణలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో దొంగల జాడ గురించిన సమాచారం కష్టతరంగా మారింది. సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. కీలకమైన ఆధారాల కోసమే దొంగతనం జరిగినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేశారు. నెల్లూరు నగరంలోని ఖుద్దూస్ నగర్‌కు చెందిన సయ్యద్ హయత్, పొర్లుకట్టకు చెందిన ఖాజా రసూల్ ఈ చోరీలకు పాల్పడ్డట్టు తెలిపారు. అయితే నిందితులు మొదట ప్లాన్ తో రెక్కీ నిర్వహించి చోరీకి సిద్ధమయ్యారన్నారు. కోర్టు ప్రాంగణంలో నిర్మాణం జరుగుతున్న ప్రదేశం నుంచి సామగ్రి చోరీ చేసేందుకు వెళ్లారన్నారు. అయితే ఆ సమయానికి అక్కడ కుక్కలు గట్టిగా అరస్తూ వెంబడించడంతో, వాటి నుంచి తప్పించుకునేందుకు కోర్టు తాళం పగలగొట్టి లోపలికి వెళ్లారన్నారు.
కాకాణి కేసులో పత్రాలేనా?
మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో 2017లో ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు. అందులో ఆయనే ఏ-1గా ఉన్నారు. అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి, ఆయన కుమారుడికి విదేశాల్లో ఆస్తులు ఉన్నట్టుగా కొన్ని పత్రాలను మీడియాకు విడుదల చేశారు కాకాణి. ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించారు. దానిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. అయితే ఆ పత్రాలతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, అవన్నీ ఫోర్జరీ డాక్యుమెంట్లని సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కేసు రివర్స్ అయింది. సోమిరెడ్డిపై ఆరోపణలు చేయబోయిన కాకాణి ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో ఇరుక్కున్నారు.
కాకాణిపై సోమిరెడ్డి పరువునష్టం దావా దాఖలు చేయగా దానిపై విచారణ జరుగుతోంది. ప్రస్తుతం ఈ కేసు విచారణ నెల్లూరు 4వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో జరుగుతోంది. ఈ కేసులో ఏ-1 గా కాకాణి ఉండగా, ఏ2గా ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన పసుపులేటి చిరంజీవి అలియాస్ మణిమోహన్ ఉన్నారు. చిరంజీవి నకిలీ డాక్యుమెంట్లు రూపొందించారని, వాటిని అడ్డం పెట్టుకుని సోమిరెడ్డిపై ఆరోపణలు చేశారనేది కేసు సారాంశం. ఆరోపణలు చేసిన కాకాణి, ఫోర్జరీ డాక్యుమెంట్లు రూపొందించారంటున్న చిరంజీవి.. ఇద్దరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ కేసు వ్యవహారం ప్రస్తుతం లైమ్ లైట్లో లేదు. అయితే తాజాగా దొంగతనం జరగడంతో ఈ కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం కాకాణి గోవర్దన్ రెడ్డి మంత్రి పదవి చేపట్టారు.