Piduguralla News : జిల్లా పిడుగురాళ్లలో పోలీసుల తీరు విమర్శలకు దారితీసింది. అభం శుభం తెలియని చిన్నారులను గంటల తరబడి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని బాధితులు ఆరోపిస్తున్నారు. వైసీపీ ఫ్లెక్సీలు చింపారని విద్యారులను స్టేషన్ కు పిలిపించిన పోలీసులు సీఐ వచ్చే వరకూ స్టేషన్ లోనే ఉంచారు. ఆడుకుంటుండగా ఫ్లెక్సీలు చిరిగిపోయాయని విద్యార్థులు అంటున్నారు.  వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు విద్యార్థులను స్టేషన్ లో కూర్చోబెట్టారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వ్యక్తిగత పూచికత్తు మీద పిల్లలను తీసుకొచ్చారు స్థానిక టీడీపీ నేతలు. పిడుగురాళ్ల మండలం జానపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. 


ఫ్లెక్సీలు చించారని నిర్బంధిస్తారా? 


చిన్నారులు తెలియక తప్పు చేస్తే పోలీస్ స్టేషన్లో‌ నిర్బంధిస్తారా అని మైనార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిడుగురాళ్ల మండలం జానపాడులో ఫ్లెక్సీలు చించారని సోమవారం ఎనిమిది, తొమ్మిది సంవత్సరాల చిన్నారులు ముగ్గురిని మధ్యాహ్నం నుంచి సాయత్రం వరకు స్టేషన్లో ఉంచడాన్ని స్థానికులు తప్పుబడుతున్నారు. రాజకీయ కక్షలకు మైనర్లపై చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. ‌తప్పు చేస్తే మందలించాలి కాని క్రిమినల్ మాదిరి స్టేషన్ లో నిర్బంధం దారుణం అంటున్నారు. పోలీసుల తీరు, పరిస్థితులలో మార్పు రాకపోతే ప్రభుత్వం తీరుపై ఉద్యమిస్తామని హెచ్చరించారు మైనార్టీ నాయకులు.  


స్థానిక ఎమ్మెల్యే పర్యటనలో ఘటన 


పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పోలీస్‌ స్టేషన్‌ చిన్నారులను ఉంచడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఏ నేరం చేశారని పిల్లల్ని స్టేషన్ కు తీసుకొచ్చారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నాయకుల ఫిర్యాదుతో పిల్లలను స్టేషన్ కు తీసుకెళ్లి మందలించినట్లు బాధితులు తెలిపారు. పిల్లల్ని నానాప్రశ్నలు వేసి, గట్టిగా మందలించినట్లు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ముగ్గురు చిన్నారులు  స్టేషన్ లో భయం భయంగా గడిపారు. విషయం తెలుసుకున్న టీడీపీ మైనారిటీ నాయకుల స్టేషన్ కు వెళ్లి, వ్యక్తిగత పూచీకత్తుతో పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చారు. పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామానికి స్థానిక ఎమ్యెల్యే వచ్చిన సందర్భంగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. 


"జానపాడు గ్రామంలో మూడు, నాలుగో తరగతి పిల్లలు ఫ్లెక్సీలు కోశారని, ఎస్ఐ పవన్ కుమార్ మధ్యాహ్నాం ఒంటి గంట సమయంలో పిగుడురాళ్ల పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. సీఐ రాలేదని సాయంత్రం వరకూ వాళ్లను స్టేషన్ లోనే ఉంటారు. ఇది పోలీసుల చర్యలకు నిదర్శనం. పిల్లలు ఆకతాయితనంగా చేసిన పనులకు స్టేషన్ తీసుకొచ్చి నిర్బంధించడం సబబు కాదు. టీడీపీ నేతల పిల్లలని వేరే పార్టీ వాళ్లు ఫిర్యాదు చేస్తే ఇలా స్టేషన్ లో పెట్టడం కరెక్ట్ కాదు. మధ్యాహ్నం నుంచి ఆహారంలేకుండా ఉంచారని ఆరోపించారు. టీడీపీ నేతలు ఫ్లెక్సీలు పెడితే, పెళ్లిలో బ్యాండ్ పెడితే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. చిన్న పిల్లలు చేసిన పనికి ఇంతలా వ్యవహరించడం సబబు  కాదు " అని టీడీపీ మైనారిటీ నేతలు అన్నారు.