Tirupati Ruia Hospital News: తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. రుయా ఆస్పత్రిలో అనారోగ్య కారణాలతో చనిపోయిన ఓ బాలుడి మృతదేహాన్ని తరలించే విషయం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశం అయింది. దీంతో అక్కడ అంబులెన్స్ ల దందా ఏ స్థాయిలో ఉందో బయటికి వచ్చింది. ఆస్పత్రిలో ఓ బాలుడు చనిపోగా అతణ్ని ప్రైవేటు అంబులెన్స్‌లో తరలించేందుకు ఆస్పత్రి అంబులెన్స్ వర్గాలు అస్సలు ఒప్పుకోలేదు. ఒక శవం.. అందులోనూ చిన్న పిల్లాడి మృతదేహం విషయంలో ఇలా అంబులెన్స్ సిబ్బంది గొడవ పడడం సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. రుయా ఆస్పత్రిలో (Ruia Hospital) చికిత్స పొందుతూ ఓ బాలుడు ఈ ఉదయం (ఏప్రిల్ 26) మృతి చెందాడు. అతనికి కిడ్నీల సమస్య ఉండడంతో చనిపోయాడు. దీంతో బాలుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చేందుకు బంధువులు, కుటుంబ సభ్యులు ఓ అంబులెన్స్ ను రాజంపేటలో మాట్లాడి రుయాకు పంపించారు. ఆ అంబులెన్స్‌లో బాలుడి శవాన్ని ఎక్కించే ప్రయత్నం చేస్తుండగా, రుయా ఆస్పత్రి అంబులెన్స్ డ్రైవర్లు అందుకు ఒప్పుకోలేదు. తమ అంబులెన్స్‌లోనే తరలించాలని పట్టు పట్టారు. బయటి అంబులెన్స్‌ల వారు రావొద్దని తెగేసి చెప్పారు. ఇలా ఇరు వర్గాలు గొడవ పడడంతో ఇక చేసేది ఏమీ లేక కుమారుడైన బాలుడి మృత దేహాన్ని తండ్రి తన బైక్‌పై స్వ గ్రామానికి తీసుకెళ్లాడు. అలా అన్నమయ్య జిల్లా చిట్వేలుకు శవాన్ని తీసుకెళ్లారు.
రుయా ఆస్పత్రిలో (Ruia Hospital) సిండికేట్‌గా మారిన అంబులెన్స్ మాఫియా.. బాలుడి మృత దేహాన్ని తరలించడానికి రూ.20 వేలు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. రుయా అంబులెన్స్ దందాపై (Ambulence Mafia) తిరుపతి ఎంపీ గురుమూర్తి స్పందించారు. రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడి విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కు వివరించారు.
సమాచారం అందుకున్న తిరుపతి ఆర్డీఓ కనకనరసారెడ్డి రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ భారతితో సమావేశం అయ్యారు. ఘటనపై పూర్తి స్ధాయిలో ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి త్వరలో కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రుయా సూపరింటెండెంట్ భారతికి ఆదేశించారు.