Tirumala SVBC Incident : తిరుమలలోని ఎస్వీబీసీకి చెందిన ఐదు ఎల్ఈడీ స్క్రీన్‌లలో ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం 5.12 గంటల నుంచి 6.12 గంటల వరకు మూడు ఇతర ఛానళ్ల కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. ఈ ఘటనకు బాధ్యుడైన గ్రేడ్ - 1 అసిస్టెంట్ టెక్నిషియన్ పి.రవికుమార్‌ను సస్పెండ్ చేస్తూ టీటీడీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రేడియో అండ్ బ్రాడ్ కాస్టింగ్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ఇంజినీర్ ఎవివి.కృష్ణ ప్రసాద్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. తిరుమలలో ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం ఎస్వీబీసీకి చెందిన ఎల్ఈడీ స్క్రీన్‌లలో ఇతర ఛానళ్ల కార్యక్రమాలు ప్రసారమైన సంఘటనపై టీటీడీ ఈవో కె.ఎస్.జవహర్‌రెడ్డి స్పందించారు. ఈ సంఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సీవీఎస్వో నరసింహ కిషోర్‌ను ఆదేశించారు.
అసిస్టెంట్ టెక్నీషియన్ సస్పెండ్
ఈ మేరకు సంబంధిత విజిలెన్స్ అధికారులు తిరుమల ఆస్థాన మండపంలోని బ్రాడ్ కాస్టింగ్ విభాగం కంట్రోల్ రూం, కమాండ్ కంట్రోల్ రూం సెంటర్, పీఏసీ-4లోని సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించి సంబంధిత అధికారులు, సిబ్బందిని విచారించారు. సంఘటన జరిగిన సమయంలో అసిస్టెంట్ టెక్నీషియన్ పి.రవికుమార్ కర్నూలుకు చెందిన తన స్నేహితుడు గోపిక్రిష్ణతో కలిసి బ్రాడ్ కాస్టింగ్ టీవీ సెక్షన్ కంట్రోల్ రూంలోకి ప్రవేశించారని గుర్తించారు. కొంత సమయం తరువాత రవికుమార్‌తో పాటు అక్కడి ఉద్యోగులు అందరు బయటకి వచ్చారని సాయంత్రం 5.28 గంటల వరకు గోపికృష్ణ మాత్రమే కంట్రోల్ రూంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ సమయంలోనే ఘటన జరిగినట్లు విచారణలో నిర్థారణ అయింది. ఈ మేరకు పి.రవికుమార్‌ను సస్పెండ్ చేయారు. అసిస్టెంట్ ఇంజినీర్ ఎవివి. కృష్ణ ప్రసాద్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు.
అసలేం జరిగిందంటే?
తిరుమలలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఎల్‌డీఈ స్క్రీన్‌పై సినిమా పాటలు దర్శనమిచ్చాయి. ఇది చూసిన భక్తులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. గోవింద నామస్మరణతో మారుమోగాల్సిన ప్రదేశంలో కమర్షియల్ సినిమా పాటలేంటని ఆశ్చర్యపోయారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా ఆధ్యాత్మిక భావనను అడుగడునా ఉట్టిపడేలా చేసేందుకు ఎస్వీబిసి ఛానెల్ తిరుమలలో చాలా ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేసింది. ఎస్‌వీబీసీ ఛానల్‌లో వచ్చే కార్యక్రమాలు ఇందులో కనిపిస్తుంటాయి. అలాంటి స్క్రీన్‌పై ఒక్కసారిగా సినిమా పాటలు చూసిన జనం బిత్తరపోయారు.
తిరుమలలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్‌లపై సాయంత్రం ఆరు గంటలకు అధ్యాత్మిక కార్యక్రమాలకు బదులుగా స్క్రీన్ పై ఒక్కసారిగా సినిమా పాటలు ప్రసారమయ్యాయి. ఒకట్రెండు నిమిషాలై ఉంటే ఏదో పొరపాటున జరిగి ఉంటుందని అనుకోవచ్చు. కానీ దాదాపు అరగంటపాటు సినిమా పాటలను ఎస్వీబీసీ సిబ్బంది ప్రసారం చేశారు. ఓ వైపు టీటీడీ బ్రాడ్ క్యాస్టింగ్‌లో గోవింద నామాలు వినపడుతుండగా, మరోవైపు స్క్రీన్‌పై సినిమా పాటలు రావడాన్ని భక్తులు తప్పుబడుతున్నారు. తిరుమల శ్రీవారి ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన ఎస్వీబీసీ ఛానల్‌లో సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తులు కేకలు వేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు