రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల్లో గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఉల్లంఘించారని ఏపీ ప్రభుత్వంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై ఎన్జీటీ తీర్పు రిజర్వు చేసింది. ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ పనులు చేపట్టిందని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ గ్రీన్ ట్రిబ్యున్, చెన్నై బెంచ్ లో పిటిషన్ వేశారు. దీనిపై ఎన్జీటీ-చెన్నై బెంచ్ లో విచారణను ముగించింది. పనులు ఆపాలంటూ ఆదేశాలిచ్చిన తర్వాత చేపట్టిన కార్యకలాపాలపై తెలంగాణ ప్రభుత్వం ఎన్జీటీకి ఫొటోలు అందించింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నేతృత్వంలో ఎన్జీటీ చెన్నై బెంచ్ నిపుణుల కమిటీ ప్రాజెక్టు పనులను రెండు రోజులు పరిశీలించి నివేదిక అందించింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన నివేదికను సైతం పరిశీలించిన అనంతరం రెండు రాష్ట్రాల వాదనలను ఎన్జీటీ విన్నది. అనంతరం ఎన్జీటీ చెన్నై బెంచ్ తీర్పు రిజర్వ్ చేసినట్లు ప్రకటించింది.
Also Read: పోలవరం పనులకు "స్టాప్ వర్క్ ఆర్డర్" టెన్షన్..!
గత విచారణలో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టిందని గతంలో తెలంగాణ జాతీయ హరిత ట్రైబ్యునల్ లో వాదించింది. నిబంధనలు పాటించని ఏపీని కచ్చితంగా శిక్షించాలని కోరింది. కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసకునే అధికారం ఎన్జీటీని కోరింది. అన్ని కోణాల్లో పరిశీలించి కోర్టు ధిక్కరణపై నిర్ణయం తీసుకుంటామని గ్రీన్ ట్రైబ్యునల్ గతంలో స్పష్టం చేసింది. ముగింపు వాదనలలో ఏపీకి అవకాశం ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు మంజూరు చేయవద్దని కేంద్రాన్ని తెలంగాణ కోరింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు లేఖ కూడా రాసింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎక్స్ఫర్ట్ కమిటీకి తెలంగాణ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ లేఖ రాశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నీటి కేటాయింపులు, అనుమతులు లేని అక్రమ ప్రాజెక్టు అని లేఖలో తెలిపింది. కృష్ణా బేసిన్ వెలుపలకు పెద్దమొత్తంలో నీటిని తరలించేందుకు రాయలసీమ ఎత్తిపోతల చేపట్టారని రజత్ కుమార్లేఖలో తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పర్యావరణంపై ప్రభావం పడుతుందని ఆరోపించింది. రోళ్లపాడు, గుండ్ల బ్రహ్మేశ్వరం, శ్రీ లంకామల్లేశ్వర, శ్రీ పెనుసిలా నరసింహ, శ్రీ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, శ్రీ వెంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ప్రాజెక్టు కాల్వలకు 10 కిలోమీటర్ల పరిధిలోపే ఉన్నాయని పేర్కొన్నారు.
Also Read: సీమ ప్రాజెక్టులో పనులేమీ జరగడం లేదని ఎన్జీటీకి కేంద్రం నివేదిక ! ఏపీ సర్కార్‌కు రిలీఫ్ !
ఫొటోలు సమర్పించిన తెలంగాణ
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందని కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గతంలో వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ఫొటోలు ఇతర ఆధారాలను చూస్తే భారీగా పనులు జరిగాయని అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన అంశంలో అధికారులను జైలుకు పంపిన సందర్భాలు గతంలో ఏమైనా ఉన్నాయా అనే అంశంపై కూడా ఆరా తీసింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన అధికారులను నేరుగా జైలుకు పంపే అధికారాలు ఎన్జీటీకి ఉన్నాయా లేక హైకోర్టు ద్వారా పంపాలా అనే విషయాలు తెలపాలని పిటిషనర్లను గతంలో కోరింది.