Nara Lokesh : ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ14గా నారా లోకేష్ పేరును సీఐడీ అధికారులు చేరుస్తూ.. ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని లోకేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుతో తనకే సంబంధం లేదని కేవలం రాజకీయ కారణాలతోనే తన పేరును ఇరికించారని ఆరోపించారు. నారా లోకేష్ 29వ తేదీ నుంచి పాదయాత్ర మళ్లీ ప్రారంభించాలనుకుంటున్నారు. కానీ ఆయన పాదయాత్ర చేయకుండా అరెస్ట్ చేసేందుకే.. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఆయన పేరును చేరుస్తూ.. సీఐడీ మెమో జారీ చేసిందని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. అందుకే పాదయాత్రకు సమస్య రాకుండా ముందస్తు బెయిల్ కోసం లోకేష్ హైకోర్టును ఆశ్రయించారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో డీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేరును చేర్చింది ఏపీ సీఐడీ. ఏ14గా పేరు చేర్చి విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు మాజీ మంత్రి నారాయణ, పలువురిని సీఐడీ నిందితులుగా పేర్కొన్నారు. అమరావతి రాజధాని మాస్టర్‌ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ తయారీ ఆమోదంలో.. చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి నారాయణ, లింగమనేని రమేష్, నారా లోకేష్, మరికొందరు కూడబలుక్కొని వారికి, అనుయాయులకు భారీ లబ్ధి చేకూరేలా, వారి భూములకు మాత్రమే భారీ రేట్లు వచ్చేలా కుట్రలు చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ఇదే సమయంలో ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌లో మార్పులు చేసి నారా లోకేష్ లబ్ధి పొందాలని ప్రయత్నించారని అభియోగాలు నమోదు చేసింది ఏసీ సీఐడీ. ఈ మేరకు మెమోలో ఏ14గా లోకేష్ పేరును మెన్షన్ చేసింది ఏపీ సీఐడీ. ఈ కేసులో ఇప్పటికే నారాయణ కుటుంబ సభ్యులు, సమీప బంధువులు సీడ్ క్యాపిటల్‌లో భూములు కొనుగోలు చేశారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని సీఐడీ చెబుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు ముందస్తు బెయిల్ పొందారు. చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ హైకోర్టులో జరుగాల్సి ఉంది.
చంద్రబాబు అరెస్ట్ తో లోకేశ్ తన యువగళం యాత్రను ఈ నెల 9వ తేదీన నిలుపుదల చేసారు. ఇక, ఇప్పుడు లోకేశ్ పైన కేసులు నమోదు అవుతున్న సమయంలో సీఐడీ అడుగుల పైన ఉత్కంఠ పెరుగుతోంది. లోకేశ్ అరెస్ట్ ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. ఈ సమయంలోనే నారా లోకేశ్ యువగళం యాత్ర తిరిగి ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేసారు. ఎక్కడైతే లోకేశ్ యాత్ర నిలిచిందో తిరిగి అక్కడనుంచే శుక్రవారం రాత్రి 8.15 నిమిషాలకు నారా లోకేశ్ తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అధికారికంగా ప్రకటించారు. లోకేశ్ పాదయాత్రను అక్రమ కేసులతో అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. అయినా పాదయాత్రను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుంచే ఇది ప్రారంభం అవుతుందని చెప్పారు.