CM Jagan: ఐఎంఎఫ్ కు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను స్వాగతించడం చాలా ఆనందంగా ఉందని ఐఎంఎఫ్ అధికారి గీతాగోపినాథ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపారు. యూఎన్ పర్యటనలో భాగంగా ఏపీ విద్యార్థులు ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించినందుకు తాను సంతోషిస్తున్నట్లు వెల్లడించారు.






దీనిపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. తమ పిల్లలను కలుసుకున్నందుకు, వారిని ఇంత ఆప్యాయంగా స్వీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. విద్య అనేది వ్యక్తిగత జీవితాలను మార్చడమే కాకుండా మొత్తం సమాజాన్ని మార్చడంలో అతిపెద్ద ఉత్ప్రేరకంగా పని చేస్తుందని తాను నమ్ముతున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇందుకు ఏపీ విద్యార్థులే నిదర్శనం అని అన్నారు. అంతర్జాతీయ వేదికపై ఆత్మ విశ్వాసంతో ప్రాతినిథ్యం వహిస్తున్న తమ పిల్లలను చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుందని వెల్లడించారు. 






ఎస్డీజీ యాక్షన్ వీకెండ్ సదస్సులో విద్యార్థులు


ఐక్య‌రాజ్య‌ స‌మితి వేదిక‌గా న్యూయార్క్‌లో జ‌రిగిన ఎస్డీజీ యాక్ష‌న్ వీకెండ్ స‌ద‌స్సులో.. ఏపీకి చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే. సెప్టెంబర్ 16వ తేదీ రోజు జనరల్ అసెంబ్లీలో జరిగిన సదస్సులో ఏపీ విద్యార్థులు తమ గళం వినిపించారు. తొలిరోజు దడాల జ్యోత్స్న, పసుపులేటి గాయత్రి, అల్లం రిషితారెడ్డి, మోతుకూరి చంద్రలేఖ, షేక్ అమ్మాజాన్, వంజివాకు యోగేశ్వర్ మాట్లాడారు. 2030 నాటికి భవిష్యత్ తరాలకు స్థిరమైన అభివృద్ధిని అందించాలన్న నినాదంతో నిర్వహించిన ఈ సదస్సులో విద్యార్థులు సుస్థిరాభివృద్ధిలో యువత ప్రాధాన్యం చాలా అవసరం అని అన్నారు. అభివృద్ధికి యువత టార్చ్ బేరర్ గా బాధ్యత తీసుకోవడం ఎంతో అవసరం అని పేర్కొన్నారు. అయితే యూఎన్ఓ స‌ద‌స్సులో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విద్యార్థులు పాల్గొన‌డం దేశ చ‌రిత్రలోనే ఇది తొలిసారి కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులను లీడర్లను చేసేలా విద్యా వ్యవస్థలో సీఎం జగన్ అనేక సంస్కరణలు చేపట్టారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఆయన తీసుకొస్తున్న అద్భుతమైన పథకాల వల్లే సర్కారు బడిలో చదివే పిల్లలకు యూఎన్ఓ సదస్సులో స్థానం దక్కిందని అంటున్నారు.