MP Margani Bharat: రాష్ట్రంలో రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సీఎం జగన్ నిర్వహించిన సమావేశ వివరాలను ఎంపీ భరత్ స్థానిక మీడియాకు పత్రికా ప్రకటన ద్వారా బుధవారం తెలియజేశారు. ఎవరైతే ప్రజాభిమానం చూరగొన్నారో వారికే టికెట్ అని స్పష్టంగా సీఎం ప్రకటించారని చెప్పుకొచ్చారు. అలాగని టికెట్ రానివారిని తక్కువ చేసినట్టు కాదన్నారని చెప్పారు. పార్టీ ముఖ్యమని, ఆ తర్వాతే ఏదైనా అని స్పష్టం చేశారని తెలిపారు. వచ్చే ఎన్నికలలో 175కు 175 సీట్లు గెలవాలనే లక్ష్యంతో పని చేయాలని‌ సీఎం జగన్ తమకు దిశానిర్దేశం చేశారన్నారు. పార్టీ శ్రేణులంతా ఈ ఆరు నెలలూ కష్టపడి పనిచేస్తే తప్పకుండా ఆ లక్ష్యాన్ని చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదన్నారని‌ ఎంపీ తెలిపారు.


‌పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని సీఎం సూచించారని చెప్పారు. క్షేత్రస్థాయిలో సానుకూల పరిస్థితులు ఉన్నాయని, ఒంటరిగా పోటీ చేయలేక ప్రతిపక్షాలు పొత్తులకు వెళ్తున్నాయని ఎంపీ భరత్ పేర్కొన్నారు. ‌అయితే తమకు సీఎం అండ.. మేము ప్రజలకు అండగా ఉండాలనే భావనతో ప్రజలకు సేవ చేసేందుకు నిరంతరం సిద్ధంగా ఉంటామని ఎంపీ భరత్ ఈ సందర్భంగా తెలిపారు. ‌


సీఎం జగన్ కార్యకర్తలకు ఏం చెప్పారంటే..?


అసెంబ్లీ సమావేశాలు రేపటితో అయిపోయిన తర్వాత మనం గేర్‌ మార్చాల్సిన సమయం కూడా వచ్చిందని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇంచార్జులతో ఆయన సమావేశం నిర్వహించారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇన్నిరోజులు మనం చేసిన ప్రచారం, గడప గడపకూ కార్యక్రమాలు ఒక ఎత్తు, అసెంబ్లీ ముగిశాక చేసే కార్యక్రమాలు, ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరు ఇవన్నీ ఇంకొక ఎత్తు అని వైఎస్ఆర్ సీపీ నేతలతో అన్నారు.


‘‘ఇన్ని రోజులు మనం బాగా చేశాం కదా, వచ్చే ఆరు నెలలు సరిగా పనిచేయకపోయినా పర్వాలేదు అనే భావన సరికాదు. వచ్చే ఆరునెలలు ఎలా పనిచేశామన్నది చాలా ముఖ్యమైన విషయం. ఇది మనసులో పెట్టుకుని ప్రతి అడుగూ ముందుకు పడాలి. ఇంతకముందు నేను చెప్పాను. 175 కి 175 స్థానాల్లో గెలుపు ఎందుకు సాధ్యం కాదు?   వైనాట్‌ 175. ఇది సాధ్యమే. క్షేత్రస్థాయిలో అందుకు తగ్గ సానుకూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టే, ఇది సాధ్యం. క్షేత్రస్ధాయిలో మనం అంత బలంగా ఉన్నాం కాబట్టే.. ప్రతిపక్షాలు ఒంటరిగా పోటీచేయలేక, భయపడి పొత్తులకు వెళ్తున్నాయి.


గడపగడపకూ కార్యక్రమంలో మన పార్టీపట్ల, ప్రభుత్వం పట్ల సానుకూల స్పందనను మీరంతా కళ్లారా చూశారు. ప్రతి ఇంటికీ మీరు వెళ్లినప్పుడు, మీరు ఇచ్చిన లేఖను ఆ అక్కచెల్లెమ్మలకు ఇచ్చినప్పుడు వాళ్లలో వచ్చిన స్పందనను మీరు చూశారు. ఇదే ఆత్మవిశ్వాసం, ఇదే ధైర్యం, ఇదే మందు చూపు, ముందస్తు ప్రణాళికతో అందరూ అడుగులు ముందుకేయాలి. అందుకనే ఇంతకు ముందు చేసిందంతా ఒక ఎత్తు, ఈ ఆరునెలల్లో మనం చేయబోయేది మరొక ఎత్తు. ప్రజలతో నిరంతరం సంబంధాలు నెరుపుతూ, వారితో మమేకమై ఉండడం ఒక ముఖ్యమైన విషయం కాగా, ఆర్గనైజేషన్, ప్లానింగ్, వ్యూహాలు మరొక ముఖ్యమైన విషయం. వీటికి సంబంధించిన ప్రతి అడుగు రాబోయే రోజుల్లో వేయాలి.