New Dialysis Unit In Bangarupalyam In Chittor District: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో (Bangarupalyam) డయాలసిస్ యూనిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రూ.3 కోట్లతో యూనిట్ ప్రారంభించబోతున్నట్లు మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. 'యువగళం' పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తైన సందర్భంగా శుక్రవారం ఈ యూనిట్ ప్రారంభించబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ డయాలసిస్ యూనిట్ ద్వారా రోజుకు 10 మంది కిడ్నీ రోగులకు డయాలసిస్ నిర్వహించే అవకాశం ఉందని.. అవసరాన్ని బట్టి భవిష్యత్‌లో యూనిట్ సామర్థ్యాన్ని పెంచుతామని వెల్లడించారు. కాగా, యువగళం పాదయాత్ర 100 కిలోమీటర్ల పూర్తైన సందర్భంగా గతేడాది బంగారుపాళ్యంలో కిడ్నీ డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తూ.. ఆనాడు శిలాఫలకాన్ని లోకేశ్ ఆవిష్కరించారు. ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు దాన్ని నెరవేర్చారు. దీంతో స్థానిక టీడీపీ నేతలు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
'ఇది మంచి ప్రభుత్వం'
కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తైన క్రమంలో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శుక్రవారం నుంచి 'ఇది మంచి ప్రభుత్వం' పేరిట ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు బుధవారం ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నామని.. వరదలు, విపత్తుల సమయంలో ప్రజల్లోనే ఉంటూ సహాయ కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. వీటిని నేతలంతా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్దేశించారు. ఈ నెల 20వ తేదీ (శుక్రవారం) నుంచి 6 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. 100 రోజుల పాలనలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజలకు వివరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రగతిని ప్రతి ఇంటికీ చేరవేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని టీడీపీ వర్గాలు తెలిపాయి.
అటు, ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు.. శ్రీకాకుళం జిల్లాలోని కవిటి మండలం రాజపురం గ్రామంలో నిర్వహించే గ్రామసభలో శుక్రవారం పాల్గొనున్నారు. ప్రభుత్వ పథకాలతో ప్రజలకు చేకూరిన లబ్ధిని వివరించడం సహా ప్రతిపక్షం ఆరోపణల్ని తిప్పికొట్టేలా ప్రజలను చైతన్యం చేసే దిశగా సీఎం మాట్లాడనున్నట్లు ఎమ్మెల్యే బెందాళం అశోక్ తెలిపారు. గ్రామంలోని పలువురు లబ్ధిదారుల ఇంటికి సైతం వెళ్లి వారితో మాట్లాడుతారని చెప్పారు. మరోవైపు, సీఎం పర్యటన క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం హోదాలో ఆయన తొలిసారి సిక్కోలులో పర్యటిస్తున్నారు. దీంతో పార్టీ శ్రేణులు కొత్త ఉత్సాహంతో ఆయనకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నాయి.