Nara Lokesh Anger on Police: దేశవ్యాప్తంగా మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోనూ వివిధ పార్టీల నేతల వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ జాతీయ నారా లోకేశ్ (Nara Lokesh) కాన్వాయ్ ను ఉండవల్లి కరకట్ట వద్ద పోలీసులు చెక్ చేశారు. అయితే, పోలీసుల తీరుపై లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే రోజు రెండుసార్లు తన కాన్వాయ్ తనిఖీ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికే, 3 రోజుల్లో నాలుగు సార్లు తనిఖీ చేశారని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ అమల్లో భాగంగానే తనిఖీ చేస్తున్నామని పోలీసులు ఆయనకు నచ్చచెప్పేందుకు యత్నించారు. అయితే, సీఎం జగన్ కాన్వాయ్, స్థానిక వైసీపీ నేతల వాహనాలను ఎన్నిసార్లు తనిఖీ చేశారని నిలదీశారు. వారి కార్లను ఎందుకు సోదా చేయడం లేదని ప్రశ్నించారు. 


కాగా, మంగళగిరి (Mangalagiri) నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు నారా లోకేశ్ వెళ్తుండగా ఆయన కాన్వాయ్ ను ఆదివారం ఉదయం పోలీసులు తనిఖీ చేశారు. తాడేపల్లి టౌన్ లో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న సమయంలో ఆయన వాహన శ్రేణిలోని కార్లన్నింటినీ క్షుణ్ణంగా చెక్ చేశారు. కాన్వాయ్ లో కోడ్ కు విరుద్ధంగా ఏమీ లేదని పోలీసులు నిర్ధారించారు. ఈ తనిఖీలకు లోకేశ్ పూర్తిగా సహకరించారు.


3 రోజుల్లో నాలుగుసార్లు


అయితే, కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ పోలీసులు నాలుగుసార్లు లోకేశ్ కాన్వాయ్ ను తనిఖీ చేశారు. ఈ తనిఖీలకు ఆయన పోలీసులకు పూర్తిగా సహకరించారు. మార్చి 20న (బుధవారం), 23న (శనివారం), ఆదివారం ఉండవల్లి కరకట్ట వద్ద ఉదయం, సాయంత్రం లోకేష్ కాన్వాయ్ ఆపి తనిఖీలు చేశారని.. వరుసగా ఆయన్నే టార్గెట్ చేస్తున్నారని.. వైసీపీ నేతల వాహనాలను చెక్ చేయడం లేదని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. కోడ్ అమలులో భాగంగానే ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. 


అచ్చెన్నాయుడు విమర్శలు


ఎన్నికల తనిఖీల పేరుతో మంగళగిరి పోలీసులు నారా లోకేష్ కాన్వాయ్‌పై ప్రత్యేకంగా టార్గెట్ చేసి ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 'ఒకే రోజులో రెండు సార్లు, మూడు రోజుల్లో నాలుగు సార్లు లోకేష్ కాన్వాయ్‌ను పోలీసులు చెక్ చేశారు. కేవలం ఆయన వాహనాలను మాత్రమే ఆపాలని పోలీసులకు ఏమైనా ఆదేశాలు ఉన్నాయా? వైసీపీ నేతల కార్లు ఎందుకు ఆపి చెక్ చేయడం లేదు? లోకేష్ కాన్వాయ్‌ను ఆపిన మాదిరి వైసీపీ నేతల వాహనాలు ఆపి తనిఖీలు చేసుంటే పోలీసులు ఆధారాలు చూపించాలి. మంగళగిరి పోలీసులు తాడేపల్లి ఆదేశాలతో పనిచేస్తున్నారో, లేక ఎన్నికల సంఘం ఆదేశాలతో పని చేస్తున్నారో చెప్పాలి. నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో లోకేష్ నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమాలు ఆపాలని జగన్ రెడ్డి ఆదేశాలు ఏమైనా ఉన్నాయా?. టీడీపీ నాయకులు కోడ్ ఉల్లంఘనలకు పాల్పడరు. లోకేశ్ కాన్వాయ్‌లో కోడ్‌కు విరుద్ధంగా ఏమీ లేదని ఎన్నికల నిబంధనలకు అనుగుణంగానే ప్రచారం సాగుతోందని పోలీసులు నిర్ధారించారు. ఇకపై కావాలని, ఇష్టానుసారం లోకేష్ కాన్వాయ్‌ను ఆపి ఇబ్బందులకు గురి చేస్తే ఎన్నికల సంఘానికి పిర్యాదు చేస్తాం. లోకేష్ ప్రచారాన్ని అడ్డుకుంటున్న మంగళగిరి పోలీసులు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉన్న జగన్ రెడ్డి బొమ్మలు ఎందుకు తొలగించడం లేదు.' అని అచ్చెన్నాయుడు నిలదీశారు.


Also Read: Mla Eliza: వైసీపీకి మరో షాక్ - షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన చింతలపూడి ఎమ్మెల్యే