Nara Brahmani: మాజీ ఎంపీ హర్ష కుమార్ కుమారుడు జీవీ శ్రీ రాజ్, కోడళ్లు అన్విత, అంకితలు నారా బ్రాహ్మిణిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాజమండ్రిలో క్యాంప్ ఆఫీసులో ఉంటున్న నారా చంద్రబాబు నాయుడు కోడలు నందమూరి నారా బ్రాహ్మణి బాధను పంచుకోవడానికి వెళ్లినట్లు తెలిపారు. మద్దతు ఇచ్చి ఓదార్చే ప్రయత్నం చేసినట్లు వెల్లడిచారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి.. కావాలనే కక్ష సాధింపు చర్యలో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మాజీ ఎంపీ హర్ష కుమార్ ను అరెస్టు చేసి 80 రోజులు సెంట్రల్ జైల్లో ఉంచారని.. ఇప్పుడు అదే విధంగా చంద్రబాబును కావాలని జైల్లో పెట్టించారని చెప్పుకొచ్చారు.
ఒక కేసులో అరెస్టు చేసి, వివిధ కేసుల్లో పీటీ వారెంట్లు జారీ చేసి జైలు పదవీ కాలాన్ని పొడగించేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎంతగానో ప్రయత్నిస్తున్నారని జీవీ శ్రీరాజ్ వెల్లడించారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో సీఎం జగన్ అనుకున్న రీతిలో పాలించలేకపోతున్నారని, పోలవరం లాంటి ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేయలేకపోతున్నారని ప్రజలు చర్చించుకంటున్నట్లు పేర్కొన్నారు. పేదవాడు తాగే చీప్ లిక్కర్ కి విదేశీ మద్యం రేట్లు వేయడం దారుణం అన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు అరెస్టు డైవర్ట్ అయ్యేలా.. మైండ్ గేమ్ లో భాగంగా జరుగుతున్న విషయమేనని చెప్పుకొచ్చారు. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలని సూచించారు.
మరోవైపు అక్టోబర్ రెండు నుంచి నారా భువనేశ్వరి నిరాహార దీక్ష
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ అక్టోబర్ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించారు. నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన ప్రాంతంలోనే పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం భవిష్యత్తు కార్యాచరణను అచ్చెన్న ప్రకటించారు. ఆ రోజు నారా భువనేశ్వరి నిరాహారదీక్ష చేస్తారని ప్రకటించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ అక్టోబర్ 2 రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు ప్రతి ఇంట్లో లైట్లన్నీ ఆపేసి ప్రజలు నిరసన తెలపాలని కోరారు. లైట్లు ఆపి వరండాలో కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేయాలన్నారు.ఈ సమావేశంలో ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్‌బాబు, అశోక్ బాబు, బీద రవిచంద్ర, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ-జనసేన సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఏర్పాటు చేయాలని నేటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ జేఏసీ రాష్ట్రస్థాయిలో ఉంటుందని, ఇకపై ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో జనసేనతో సమన్వయం చేసుకుంటూ టీడీపీ కార్యకలాపాలు ఉంటాయని వివరించారు. లోకేశ్ పై సంబధం లేని ఆరోపణలు చేస్తున్నారని, అసలక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డే లేనప్పుడు కేసు ఏంటని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. పైగా, భూసేకరణ కూడా జరగలేదని వెల్లడించారు. ఏమీ జరగని చోట ఏదో జరిగిందనే భ్రాంతికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశానికి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీ నుంచి జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. పలు కీలక సూచనలు చేశారు.