Chandrababu Naidu Arrest : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ అక్టోబర్ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించారు. నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన ప్రాంతంలోనే పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం భవిష్యత్తు కార్యాచరణను అచ్చెన్న ప్రకటించారు. ఆ రోజు నారా భువనేశ్వరి నిరాహారదీక్ష చేస్తారని ప్రకటించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ అక్టోబర్ 2 రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు ప్రతి ఇంట్లో లైట్లన్నీ ఆపేసి ప్రజలు నిరసన తెలపాలని కోరారు. లైట్లు ఆపి వరండాలో కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేయాలన్నారు.ఈ సమావేశంలో ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్‌బాబు, అశోక్ బాబు, బీద రవిచంద్ర, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ-జనసేన సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఏర్పాటు చేయాలని నేటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ జేఏసీ రాష్ట్రస్థాయిలో ఉంటుందని, ఇకపై ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో జనసేనతో సమన్వయం చేసుకుంటూ టీడీపీ కార్యకలాపాలు ఉంటాయని వివరించారు. లోకేశ్ పై సంబధం లేని ఆరోపణలు చేస్తున్నారని, అసలక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డే లేనప్పుడు కేసు ఏంటని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. పైగా, భూసేకరణ కూడా జరగలేదని వెల్లడించారు. ఏమీ జరగని చోట ఏదో జరిగిందనే భ్రాంతికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశానికి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీ నుంచి జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. పలు కీలక సూచనలు చేశారు.
పీఏసీ కమిటీ టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతు తెలిపిన, అరెస్ట్‌ను ఖండిస్తూ నిరసనలు చేస్తున్న వారికి పీఏసీ ధన్యవాదాలు తెలిపింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనంతరం ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలు, తదుపరి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. బాబుతో నేను కార్యక్రమంతో పాటు ఓటర్ వెరిఫికేషన్‌ను ఎలా ముందుకు తీసుకువెళ్ళాలని నిర్ణయించారు. ఇకపై జనసేనతో కలిసి కార్యక్రమాలు నిర్వహించే అంశంపై కూడా చర్చ జరుగింది. పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు టీడీపీ పూర్తి మద్దతు ప్రకటించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో టీడీపీ శ్రేణులు నేరుగా పాల్గొనే అవకాశం ఉంది.
కేసులకు తాము భయపడేది లేదని నందమూరి బాలకృష్ణ సమావేశం అనంతరం స్పష్టం చేశారు. తప్పు చేయనప్పుడు దేవుడికి కూడా భయపడాల్సిన అవసరం లేదన్నారు. సీఎం జగన్ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారని మండిపడ్డారు. ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని.. ఆయనపై స్కిల్ కేసును రాజకీయ కక్షతోనే పెట్టారని ఆరోపించారు.