New York City Floods: 


న్యూయార్క్ నగరంలో వరదలు..


అమెరికాలో న్యూయార్క్‌ నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు వీధులన్నీ చెరువుల్లా మారిపోయాయి. అపార్ట్‌మెంట్‌లలోని సెల్లార్‌లన్నీ జలమయం అయ్యాయి. ఎయిర్‌పోర్ట్ కూడా మూసేయాల్సి వచ్చింది. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని స్థాయిలో వరదలు వచ్చినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.  7.97 అంగుళాల వర్షపాతం నమోదైంది. 1948 తరవాత ఇదే రికార్డు. దాదాపు 44 ఫ్లైట్స్‌ ఆలస్యంగా నడుస్తున్నాయి. 50 ఫ్లైట్‌ సర్వీస్‌లను రద్దు చేశారు. భారీ వర్షంతో పాటు ఈదురు గాలులు వీచాయి. ఫలితంగా ట్రాన్స్‌ఫార్మర్‌లపై ప్రభావం పడింది. నార్త్ కరోలినా, వర్జీనియా, పెన్సిల్వేనియా, న్యూజెర్సీల్లో కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. అనుకోకుండా భారీ వర్షం కురవడం వల్ల జనజీవనం స్తంభించిపోయింది. అమెరికాలో పలు రాష్ట్రాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వర్షపాతం ఇంకా పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అయితే...ఈ వర్షాల కారణంగా ఎవరూ చనిపోలేదని, అలాంటి సంఘటనలేవీ జరగలేదని స్పష్టం చేశారు అధికారులు. వరదల్లో చిక్కుకున్న వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకూ మరణాలు నమోదు కాకపోయినా...ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 




మోకాలి లోతు నీళ్లు..


ఇప్పటికే స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించారు న్యూయార్క్ మేయర్. నేషనల్ గార్డ్ ట్రూప్‌లు పెద్ద ఎత్తున న్యూయార్క్‌కి చేరుకున్నాయి. న్యూయార్క్‌లో సబ్‌ వేలు వరద నీటితో నిండిపోయాయి. ఫలితంగా...ఆ సబ్‌వే లైన్స్‌ని పూర్తిగా మూసేశారు. మెట్రో స్టేషన్‌లనూ మూసేశారు. కొన్ని బస్‌ రూట్‌లూ ఎఫెక్ట్ అయ్యాయి. వీధుల్లో మోకాలి లోతు నీళ్లు చేరాయి. స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యావసరాలకు అవస్థలు పడాల్సి వస్తోంది. 13 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఇప్పటికే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ప్రాణనష్టం నమోదు కాకుండా ప్రయత్నిస్తున్నాయి.