YS Jagan on Tragedy in YSR Kadapa District | బ్రహ్మంగారి మఠం: చెరువులో ఈతకు దిగిన ఐదుగురు బాలురు మృతిచెందారు. వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లెలో మంగళవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మృతిచెందిన చిన్నారులను చరణ్ (15), దీక్షిత్ (12), హర్ష (12), పార్థు (12), తరుణ్ యాదవ్ (10) మృతిచెందారు.
వేసవి సెలవులు రావడంతో మల్లేపల్లెకి చెందిన ఉప్పలపాటి నారాయణ యాదవ్ ఇంటికి చెల్లెళ్లు సావిత్రి, భవాని హైదరాబాద్ నుంచి తమ పిల్లలతో కలిసి వచ్చారు. సమ్మర్ కావడంతో సరదాగా చెరువుకు వెళ్లి ఈత కొడదామనుకున్నారు. సావిత్రి కుమారుడు హర్ష, భవాని పిల్లలు చరణ్, పార్థు, మల్లేపల్లె గ్రామానికి చెందిన మేకల గంగాధర్ కుమారుడు తరుణ్ యాదవ్, కాశినాయన మండలం మల్లేరు కొట్టాలకు చెందిన నారాయణ కుమారుడు దీక్షిత్ మల్లేపల్లిలోని చెరువు వద్దకు వెళ్లారు.
రాత్రి అయినా పిల్లలు ఇంటికి తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. చెరువు ఒడ్డున పిల్లల బట్టలు కనిపించడంతో దాంతో బాలురు చెరువులో గల్లంతైనట్లు భావించారు. పోలీసుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టగా రాత్రి 11 గంటల తర్వాత బాలుర మృతదేహాలు లభ్యమయ్యాయి. మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ తో పాటు ఎస్‌ఐ శివప్రసాద్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. గాలింపు చర్యలను పర్యవేక్షించారు.
చిన్నారులు మృతిపై మాజీ సీఎం వైయస్ జగన్ దిగ్భ్రాంతి
వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లె చెరువులో ఈతకు దిగి ఐదుగురు చిన్నారులు మృతి చెందడంపై మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు చరణ్, పార్ధు, హర్ష, దీక్షిత్, తరుణ్ యాదవ్ వేసవి సెలవులు కావడంతో గ్రామంలోని చెరువు వద్దకు ఈతకు వెళ్ళి మృతిచెందడంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. ఈతకు వెళితే ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని జగన్ కోరారు.