Minister Taneti vanitha: కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న దర్శిత్ కుటుంబ సభ్యులను హోమంత్రి తానేటి వనిత పరామర్శించారు. కొవ్వూరు నియోజక వర్గం తాళ్లపూడి మండలం పైడిమెట్ల గ్రామంలో మూడేళ్ల బాలుడు దర్శిత్ విద్యుత్ షాక్ కు గురైన విషయం అందరికీ తెలిసిందే. చికిత్స సమయంలో ఇన్ఫెక్షన్ కారణంగా బాలుడి రెండు కాళ్లను వైద్యులు తొలగించారు. అయితే హోంమంత్రి దర్శిత్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాలుడికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. బాలుడి తల్లిదండ్రులు వినోద్, చాందినిలను ఓదార్చారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని దర్శిత్ తల్లిదండ్రులకు హామీ హోంమంత్రి తానేటి వనిత హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి రూ.3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. 



అంతే కాకుండా పలువురు దాతలు కూడా దర్శిత్ వైద్యానికి సాయం అందించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు స్పందించి.. 15.83 లక్షల ఆర్థిక సాయం అందిందని బాలుడి తండ్రి వినోద్ తెలిపారు. 


అసలేం జరిగిందంటే..?


తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పైడిమెట్ట గ్రామానికి జొన్నకూటి వినోద్ లారీ డ్రైవర్, భార్య చాందిని గృహిణి. హెద్ద కుమారుడు అక్షిత్ యూకేజీ చదువుతున్నాడు. రెండో కుమారుడు దర్శిత్ కు మూడేళ్లు. ఈనెల 12వ తేదీన తల్లి భవనంపై దుస్తులు ఆరేయడానికి వెళ్లగా.. ఆమెతో పాటే దర్శిత్ కూడా వెళ్లాడు. ఆమె పనిలో నిమగ్నం అవగా.. చిన్నారి అక్కడున్న 33 కేవీ విద్యుత్తు తీగల సమీపానికి వెళ్లి... విద్యుదాఘాతానికి గురై స్పృహ కోల్పోయాడు. అప్పటి వరకు ఆడుకుంటున్న కుమారుడు పడిపోవడంతో చాందిని ఆందోళనకు గురైంది. హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు కాకినాడలోని జీజీహెచ్ కు తీసుకెళ్లారు. నాలుగు రోజుల చికిత్స అనంతరం ఇన్ ఫెక్షన్ సోకడంతో బాలుడికి రెండు కాళ్లూ మోకాళ్ల కింది వరకు తొలగించారు. 



అయితే తీవ్ర గాయాలైన చోట ఇన్ఫెక్షన్ తీవ్రతరం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్లాస్టిక్ సర్జరీ వార్డులో బాలుడు నరక యాతన అనుభవిస్తూ చికిత్స పొందుతున్నాడు. బాలుడికి మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తూ... ఆరోగ్యంగా కోలుకునేలా వైద్యులు విశేష కృషి చేస్తున్నారు. అయితే బాలుడి ఆరోగ్యం కొంతమేర మెరుగవుతుందన్న తరుణంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో బాలుడు శ్వాస పీల్చుకోవడం కష్టతరం అవడంతో ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. 


దీంతో వైద్యులు హుటాహుటిన సర్జికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కు తరలించి ప్రత్యేక వైద్య చికిత్స అందించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో గురువారం రాత్రి రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కు తరలించి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. సంక్లిష్టంగా మారిన బాలుడికి అనస్తీషియా వైద్యులతో పాటు పలు విభాగాల వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 48 గంటలు గడిస్తే కానీ బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి ఏం చెప్పలేమని ప్లాస్టిక్ సర్జరీ వైద్యులు తెలిపారు. చిన్నారి బాలుడు త్వరగా కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారు.