శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం చౌళూరులో 2 రోజుల క్రితం హత్య కు గురైన చౌళూరు రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను వైసీపీ రాయలసీమ రీజినల్ కో-ఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. రామకృష్ణా రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎట్టిపరిస్థితుల్లో రామకృష్ణారెడ్డి హత్యకు పాల్పడిన నిందితులను పట్టుకుని, కఠినంగా శిక్షపడేలా కృషి చేస్తామని మంత్రి అన్నారు.




'రామకృష్ణారెడ్డి లేని లోటు పూడ్చలేనిది'


మంత్రి పెద్దిరెడ్డి ముందు రామకృష్ణా రెడ్డి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. హిందూపురంలో తొలిసారిగా వైసీపీ జెండా ఎగుర వేసింది రామకృష్ణా రెడ్డి అని, వైఎస్సార్, సీఎం జగన్ అంటే రామకృష్ణారెడ్డికి ఎనలేని ప్రేమ అని రామకృష్ణా రెడ్డి కుటుంబ సభ్యులు మంత్రి పెద్దిరెడ్డికి వివరించారు. పార్టీ కోసం ప్రేమతో ఎంతో ఖర్చు చేశారని వెల్లడించారు. హిందూపురంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఎంతో శ్రమించారని తెలిపారు. 


దీనిపై స్పందించిన మంత్రి.. రామకృష్ణా రెడ్డి అంటే తమ కుటుంబంతోపాటు జగన్ కుటుంబానికి కూడా ఎనలేని ప్రేమ అభిమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. రామకృష్ణా రెడ్డి మృతి చెందడం బాధాకరమని అన్నారు. రామకృష్ణా రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలంటే.. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు మంత్రిని కోరారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అంతే కాకుండా ప్రభుత్వ పరంగా రామకృష్ణా రెడ్డి కుటుంబ సభ్యులను ఆదుకుంటామని, వారికి అన్ని విధాలా అండగా నిలుస్తామని తెలిపారు. 


ఎమ్మెల్సీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు


అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విలేకరులతో మాట్లాడారు. రామకృష్ణారెడ్డికి వైసీపీ అంటే ఎనలేని ప్రేమ అని అందరికీ తెలుసని మంత్రి అన్నారు. అలాంటి వ్యక్తి మృతి చెందడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఆయన లేని లోటును పూడ్చలేమని అన్నారు. మంత్రి మీడియా సమావేశం ముగించుకుని బయట కారు ఎక్కేందుకు రోడ్డుపైకి వస్తుండగా గ్రామస్తులు మంత్రిని అడ్డుకున్నారు. రామకృష్ణా రెడ్డి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఎమ్మెల్సీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని సర్దిచెప్పి మంత్రి కాన్వాయ్ ను ముందుకు పంపించారు. ఈ కార్యక్రమంలో కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి,పెనుగొండ ఎమ్మెల్యే మాల గుండ్ల శంకర్ నారాయణ, ఆగ్రో చైర్మన్ నవీన్ నిశ్చల్ పాల్గొన్నారు.




చౌళూరు రామకృష్ణా రెడ్డి గతంలో హిందూపురం నియోజకవర్గ వైసీపీ మాజీ సమన్వయకర్తగా పని చేశారు. ప్రస్తుతం ఆయన కర్ణాటక సరిహద్దుల్లోని చౌళూరు సమీపంలో దాబా నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 8న దాబా నుంచి ఇంటికి వచ్చారు. కారు దిగుతుండగా.. అప్పటికే అక్కడ కాపు కాసిన కొందరు దుండగులు ఆయనపై దాడి చేశారు. వేట కొడవళ్లతో అతి కిరాతకంగా చంపారు. ఏకంగా 18 చోట్ల కొడవళ్లతో నరికారు. ఆగస్టు 15న గ్రామంలో జెండా ఎగురవేసే విషయంలో ఎమ్మెల్సీ ఇక్బాల్ వర్గీయులకు, రామకృష్ణారెడ్డికి మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఎమ్మెల్సీ ఇక్బాల్ వర్గీయులు రామకృష్ణారెడ్డిని చంపేస్తామని బెదిరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.