Nara Lokesh Review On Skill Development: రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా ప్రతి నెలా జాబ్ మేళా నిర్వహణకు క్యాలెండర్ రూపొందించనున్నట్లు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. నైపుణ్యాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. యూనివర్శిటీల నుంచి బయటకు వచ్చే ప్రతీ విద్యార్థికీ ఉద్యోగం రావాలని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కరికులమ్‌లో మార్పులు చేస్తామని.. పారిశ్రామికవేత్తలతో వర్శిటీల్లో బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో స్కిల్ సెన్సెస్, పాలిటెక్నిక్, ఐటీఐ కాలేజీల్లో ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ ఇతర అంశాలపై చర్చించారు. ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ కార్యాలయాలపై నోట్‌కు మంత్రి ఆదేశించారు. అటు, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో రాష్ట్రానికి చెందిన యూనివర్శిటీల ర్యాంకింగ్స్ మెరుగుదలకు విద్యా రంగ నిపుణుల సలహాలు తీసుకోవాలని లోకేశ్ అధికారులకు నిర్దేశించారు. 2027 నాటికి మెరుగైన ర్యాంకింగ్ కోసం ప్రతీ యూనివర్శిటీకి లక్ష్యాన్ని నిర్దేశించాలని పేర్కొన్నారు. ఆంధ్రా, ఆచార్య నాగార్జున వర్శిటీలు టాప్ - 10లో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు.
'జగన్ అందుకు సిద్ధంగా ఉండాలి'
మరోవైపు, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై (YS Jagan) మంత్రి లోకేశ్ (Lokesh) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. న్యాయస్థానం, దేవుడి కోర్టులో శిక్షలకు జగన్ సిద్ధంగా ఉండాలని అన్నారు. తిరుమల శ్రీవారి విషయంలో చేయకూడని పనులన్నీ చేశారని.. వైసీపీ అధినేత పాపం పండిందని విమర్శించారు. అధికారం ఉందనే అహంకారంతో కమీషన్లకు కక్కుర్తి పడి కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశుని సన్నిధిలో కల్తీ పనులు చేశారని మండిపడ్డారు. అడ్డంగా దొరికిపోయే సరికి తన ఫేక్ ముఠాలను దింపి సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతువుల కొవ్వు కలిపిన 4 ఏఆర్ డెయిరీ నెయ్యి లారీలను టీటీడీ తిప్పి పంపిందని.. నివేదిక ఈ విషయం స్పష్టం చేసిందని చెప్పారు.
Also Read: AP Floods Amount: ఏపీలో వరద బాధితులకు ఆర్థిక సాయం పెంచిన ప్రభుత్వం, ఉత్తర్వులు జారీ