Minister Gottipati Ravikumar Comments: విద్యుత్ రంగంలో జగన్ రెడ్డి చేసిన పాపాలే నేడు రాష్ట్ర ప్రజల పాలిట ఉరితాళ్లు అయ్యాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Minister Gottipati Ravikumar) మండిపడ్డారు. ఇంధన సర్దుబాటు ఛార్జీ (ఎఫ్‌పీసీసీఏ)ల పాపం జగన్‌దేనని ఆరోపించారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రస్తుతం ప్రజల మీద విద్యుత్ ఛార్జీల భారం పడుతోందని అన్నారు. జగన్ హయాంలోనే డిస్కంలు వసూళ్లకు అనుమతి కోరాయని చెప్పారు. వాయిదా వేస్తూ, కమిషన్ ముగిసే మూడు రోజుల ముందుగా వసూళ్లకు ఆదేశాలిచ్చారన్నారు. ప్రజల సొమ్మును అప్పనంగా తన అస్మదీయులకు దోచిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఉత్పత్తికి మారుపేరైన ఏపీ జెన్కోని నిర్వీర్యం చేసి.. ప్రజావసరాల కోసం అనే పేరుతో యథేచ్ఛగా ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక రేట్లకు విద్యుత్ కొనుగోళ్లు చేశారని ధ్వజమెత్తారు.


గడిచిన ఐదేళ్లలో చేసిన విద్యుత్ కొనుగోళ్లలో జగన్ సర్కార్ ఎక్కడా పారదర్శకత ప్రదర్శించలేదని మంత్రి చెప్పారు. విద్యుత్ కొనుగోళ్లను క్విడ్ ప్రోకో విధానం ద్వారా జరిపి, వచ్చిన ప్రజల సొమ్ము అంతా తాడేపల్లి ప్యాలెస్ తరలించారని ఆరోపించారు. కేవలం విద్యుత్ కొనుగోళ్లు మాత్రమే కాకుండా బొగ్గు కొనుగోళ్ల వ్యవహారం అంతా కూడా రహస్యంగానే జగన్ రెడ్డి, పెద్దిరెడ్డిలు నడిపించారని స్పష్టం చేశారు. వీరు అనుసరించిన విద్యుత్‌ విధానాల పాపమే నేడు ప్రజల మెడలకు సర్దుబాటు ఛార్జీల ద్వారా చుట్టుకుందని విమర్శించారు. 


రూ.11,826 కోట్ల భారం


జగన్ మోహన్ రెడ్డి బరితెగింపు దోపిడి కారణంగా గడిచిన ఐదేళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆరోపించారు. ప్రస్తుతం ఏపీ ప్రజల మీద 2023-24 సంవత్సరానికి మరో రూ.11,826.42 కోట్ల భారం పడుతున్నట్లు పేర్కొన్నారు. రెండేళ్ల క్రితమే ఈ మొత్తాన్ని డిస్కంలు ప్రజల నుంచి వసూళ్లు చేస్తామని ఈఆర్సీని కోరినా సంబంధీకులు వాయిదా వేస్తూ వచ్చారని చెప్పారు. చివరగా 2024 మార్చి నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేయాల్సి వస్తే... ఎన్నికల నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుందని వాయిదా పర్వం కొనసాగినట్లు స్పష్టం చేశారు. జగన్ గద్దె దిగిపోతూ కూడా తాను చేసిన దోపిడీని ప్రజల నుంచి వసూలు చేయాలని ఈఆర్సీని కోరడం ప్రజలు గమనించాలని కోరారు. 


గత ప్రభుత్వంలోనే ప్రజల నుంచి వసూలు చేయాల్సిన మొత్తాన్ని కమిషన్ వాయిదా వేస్తూ అక్టోబరులో నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. ఈ కారణంగా జగన్ రెడ్డి చేసిన అక్రమ వసూళ్లు చంద్రబాబు హయాంలో కట్టాల్సి వస్తోందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక సాక్షి తప్పుడు కథనాలను ప్రచురిస్తోందని మండిపడ్డారు. పాపాలన్నీ జగన్ అండ్ కో చేసి చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాపాలకు పరాకాష్ట అయిన సాక్షి పత్రికను అడ్డంపెట్టుకుని తప్పుడు కథనాలను ప్రచురించడం మంచిది కాదని స్పష్టం చేశారు.


Also Read: YS Sharmila: జగన్ కోసం ఎంతో చేశా - ఇంత అన్యాయం చేస్తారా ? కంట తడి పెట్టుకున్న షర్మిల