Botsa Satyanarayana: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. సానుభూతి కోసం తమపై బాడీలు చెప్పి ఉంటారని వ్యాఖ్యానించారు. దొంగ ఎక్కువకాలం దొరలా ఉండలేడని, దొంగలు ఎప్పటికైనా దొరక్క తప్పదని అన్నారు. సుజనా చౌదరి వాళ్లు బీజేపీలో టీడీపీ బీ టీం అని, టీడీపీకి ఏపీ బీజేపీ బీ టీంగా మారిపోయిందని ఆరోపించారు. నిన్నటివరకు బీజేపీకి తెలిసే బాబును అరెస్ట్ చేశారని అన్నారని, మరి ఇప్పుడెందుకు వెళ్లి అమిత్ షాను కలిశారని బొత్స ప్రశ్నించారు. అమిత్ షాతో జరిగిన సమావేశంలో ఏం జరిగిందో పురందేశ్వరి చెప్పాలని డిమాండ్ చేశారు.


అమిత్ షాను ఎవరైనా కలవొచ్చని, తమ బాధలు చెప్పుకునేందుకు అమిత్ షాను లోకేశ్ కలిసి ఉండొచ్చని బొత్స అభిప్రాయపడ్డారు. పురందేశ్వరి, లోకేష్ కలిసి వెళ్లారో లేదా విడివిడిగా వెళ్లారో అనేది తమకు అవసరం లేదని అన్నారు. బీజేపీకి ప్రతీది చెప్పి చేయాల్సిన అవసరం తమకు లేదని, విశాఖపై వెళ్లడంపై తాము జీవో కూడా ఇచ్చామని తెలిపారు. విశాఖతో పాటు కడపలో కూడా క్యాంపు కార్యాలయం ఉంటుందని, ఇందులో దొడ్డిదారి ఏముంటుందని ప్రశ్నించారు. నోటికొచ్చినట్లు మాట్లాడటం ప్రతిపక్షాలకు అలవాటు అయిందని విమర్శించారు. ఈ సందర్భంగా బైజూస్, టోఫెల్ విషయంపై ప్రతిపక్ష పార్టీల ఆరోపణలకు బొత్స కౌంటర్ ఇచ్చారు.


 'సీఎం జగన్ తొలి ప్రాధాన్యత విద్యారంగం.. విద్యా రంగంలో జగన్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. బైజూస్ కంటెంట్ ఫ్రీగానే ఇచ్చారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇచ్చాం. అందులోనూ బైజూస్ కంటెంట్ పెట్టి ఇచ్చాం. దానికి కూడా బైజూస్‌కు ఒక్క రూపాయి ప్రభుత్వం నుంచి చెల్లించలేదు. బైజూస్ వ్యాపారాలతో మాకు సంబంధం లేదు. పిల్లలకు మంచి ఇంగ్లీష్ నేర్పడం కోసం టోఫెల్‌ని తీసుకొచ్చాం. ఏడాదికి రూ.వెయ్యి కోట్లు టోఫెల్‌కి ఇచ్చేస్తున్నామని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. టోఫెల్‌లో శిక్షణ కోసం పెట్టే టెస్ట్‌కి ఒక్కో విద్యార్థికి రూ.7.50 పైసలు మాత్రమే ఫీజు ఉంటుంది. 20 లక్షల 75 వేల మందికి ప్రభుత్వం ఆ ఫీజు కట్టింది' అని బొత్స తెలిపారు.


'టెస్ట్‌లో పాస్ అయినవారికి మాత్రమే టెస్ట్‌కి రూ.600 ఫీజు తీసుకుంటారు. మొత్తం కలిపి రూ.6 కోట్లు మాత్రమే టోఫెల్ టెస్ట్‌ల కోసం పెడితే రూ.వందల కోట్లు పెడుతున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పేద పిల్లలకు మంచి విద్య అందించడానికి ఖర్చు చేయడం తప్పా? డీఎస్సీపై కొద్దిరోజుల్లోనే స్పష్టత వస్తుంది. డీఎస్సీపై సీఎం దగ్గర చర్చ జరుగుతోంది. ముందు టెట్.. ఆ తర్వాత డీఎస్సీ నిర్వహిస్తాం. యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3,200కిపైగా పోస్టులు భర్తీ చేస్తాం. దీనికి సంబంధించి నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. 18 ఏళ్ల నుంచి యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీ జరగలేదు. పాఠశాల్లో ఖాళీలన్నీ గుర్తించాం' అని బొత్స పేర్కొన్నారు. కాగా అమిత్ షాతో లోకేష్ భేటీపై మంత్రులు వరుస కౌంటర్లు ఇస్తున్నారు. తాము కలిస్తే మీకెందుకు భయమని టీడీపీ కౌంటర్ ఇస్తోంది.