హైదరాబాద్ ప్రగతి భవన్ ముందు గురువారం (అక్టోబరు 12) దంపతులు ఆత్మహత్య యత్నం చేశారు. వెంటనే భద్రత సిబ్బంది అడ్డుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం మల్లూరు గ్రామానికి చెందిన మహేందర్ అనే దంపతులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. తమ ప్రాంతంలో డబుల్ బెడ్రూం ఇల్లు కోసం ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోగా.. తమకు దక్కలేదని వాపోయారు.


తమకు డబుల్ బెడ్ రూం ఇల్లు కేటాయించాలని జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండేను కలిస్తే దురుసుగా ప్రవర్తించారని వారు వాపోయారు. ఈ ఆవేదనతోనే తాము ఆత్మహత్యకు ప్రయత్నించామని తెలిపారు. నిజాంసాగర్‌కు చెందిన మహేందర్‌ (40) తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. కొంతకాలం క్రితం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇంటి కోసం దరఖాస్తు చేసుకోగా.. మంజూరైనట్లు ఇటీవల అధికారుల నుంచి ఫోన్‌ వచ్చిందని బాధితులు తెలిపారు. ఆ తర్వాత మహేందర్‌ ఏ అధికారి వద్దకు వెళ్లినా ఇంటి విషయంపై సరైన సమాధానం చెప్పలేదు. ఎమ్మెల్యే వద్దకు వెళ్లినా ఫలితం లేకపోయింది.


దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహేందర్‌, తన భార్యతో కలిసి ప్రగతి భవన్‌ వద్ద ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేశారు. అది గమనించిన భద్రతా సిబ్బంది వారిని కాపాడారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయంపై విచారణ చేపట్టినట్లు తెలిపారు.