Madanapalle Fire Accident: అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన అగ్ని ప్రమాద ఘటన తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనను కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తమకు అనుమానాలు ఉన్నాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనతో పాటు స్థానిక వైఎస్ఆర్ సీపీ నేతల పనే అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్ని ప్రమాదం కేసులో నిందితులు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. 


ఇప్పటికే తాము ఆర్డీవో, తహసీల్దార్‌తో పాటు ఇతర సబ్ కలెక్టర్ ఆఫీసు ఉద్యోగుల ఫోన్లు కూడా సీజ్‌ చేయించామని చెప్పారు. అన్ని రెవిన్యూ కార్యాలయాల దగ్గర్లో భద్రతను పటిష్ఠం చేశామని మంత్రి వివరించారు. ఇంకా మంత్రి అనగాని మాట్లాడుతూ.. మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై ఆరోపణలు చేశారు. ‘‘పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో దాదాపు వెయ్యి కోట్లు అక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆయన అవినీతి గురించి మాకు తెలిసింది. మొన్నటిదాకా సబ్ కలెక్టరేట్ పెద్దిరెడ్డి నియంత్రణలోనే ఉన్నట్లు గుర్తించాం. ఆయన హాయాంలో రూల్స్ ను గాలికి వదిలేసి ల్యాండ్ కన్వర్షన్ భారీగా జరిగింది. 


ఈ విషయంలో ఎమ్మెల్యే షాజహాన్ ప్రశ్నలు లేవనెత్తగానే.. సబ్ కలెక్టరేట్ లో అగ్ని ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఉద్యోగులు ఆదివారం పని చేయడం దేనికి? మీరు సక్రమంగా పని చేయకపోతే విధుల నుంచి తప్పుకోండి. గత వైసీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చేలా ఉద్యోగులు ప్రయత్నాలు చేస్తే మాత్రం చర్యలు తప్పవు’’ అని మంత్రి అనగాని సత్యప్రసాద్ వార్నింగ్ ఇచ్చారు.         


డీజీపీ పరిశీలన
ఈ ఘటనపై ఇప్పటికే సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో డీజీపీ ద్వారకా తిరుమలరావు మదనపల్లెకు వెళ్లి.. చేరుకొని సబ్‌కలెక్టరేట్ ను  పరిశీలించారు. డీజీపీతోపాటు సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ కూడా అక్కడికి వెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి వేళ మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరగడంతో విలువైన రెవెన్యూ రికార్డులు, కంప్యూటర్లు, సామగ్రి కాలిపోగా... ఇదే కార్యాలయంలో పనిచేసే గౌతమ్‌ తేజ అనే ఉద్యోగి కార్యాలయంలో అర్ధరాత్రి 12 గంటల వరకు అక్కడే ఉన్నట్లు సమాచారం.


చంద్రబాబు సమీక్ష
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌లో అగ్ని ప్రమాద ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే ఈ అంశంపై ఓ సారి రివ్యూ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి సమీక్ష నిర్వహించారు. ఉదయం నుంచి జరుగుతున్న దర్యాప్తు అంశాలపై పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. దగ్ధమైన ఫైళ్లు ఏయే విభాగాలకు చెందినవో కనుక్కోవాలని ఆదేశించారు. ఆధారాల సేకరణలో నిర్లక్ష్యానికి కారకులు ఎవరనే అంశాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. గతంలో ఇక్కడ పని చేసి వెళ్లిన అధికారుల ప్రమేయంపైనా దృష్టి పెట్టాలన్నారు.