Pawan Kalyan Comments on Jagan: ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశంలో మాజీ సీఎం జగన్ పై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరును పవన్ కల్యాణ్ తీవ్రంగా తప్పుపట్టారు. ఆయన అసెంబ్లీ సమావేశాలకు వస్తుండగా.. పోలీసులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన తీరుపై శాసనసభాపక్ష సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌కు ఇంకా తత్వం బోధ పడలేదని అన్నారు. నెల రోజుల్లోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని.. గ్రూపు తగాదాకు రాజకీయ రంగు పులుముతున్నారని అన్నారు.


‘‘అవాస్తవాలు చెప్తు కుట్రలకు తెరలేపుతున్నారు. సభలోకి వచ్చే ముందు పోలీసులతో గొడవ పెట్టుకున్నారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలమని ఎమ్మెల్యేలు రెచ్చకొట్టడం అతని అహంకార ధోరణికి నిదర్శనం. ఎల్లకాలం అధికారంలో కొనసాగుతానని భ్రమ నుంచి.. ప్రజలు బయట పడేసినా జగన్ ఇంకా తానే సీఎం అనుకుంటున్నాడేమో? రాష్ట్రాభివృద్ధికి కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. చంద్రబాబుకు నేను, నా పార్టీ నూటికి నూరు శాతం సహకరిస్తుంది’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.


చంద్రబాబు సూచనలు
ఈ ఎన్డీయే శాసన సభాపక్ష సమావేశానికి పవన్ కల్యాణ్ సహా ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరయ్యారు. ఇకపై అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రస్తావించాల్సిన అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కూటమి నేతలకు కీలక సూచనలు చేశారు. ఏపీలో శాంతి భద్రతలను కాపాడాలని చంద్రబాబు ఎమ్మెల్యేలకు సూచించారు. ఇసుక జోలికి ఎవ్వరూ వెళ్లవద్దని, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావద్దని అన్నారు. అయితే, ఇసుక ధరల విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నట్లు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి తెలపగా.. దీనిపై చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 


జగన్ కు అలవాటే
పైగా తప్పులు చేయడం.. చేసి వాటిని పక్క వారిపై నెట్టేయడం జగన్ మోహన్ రెడ్డికి అలవాటే అని చంద్రబాబు అన్నారు. వివేకా హత్య కేసును కూడా వేరే వాళ్ల మీదకు నెట్టే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. మొన్న వినుకొండలో హత్య కేసులోనూ ఇదే జరుగుతోందని.. దానికి రాజకీయ రంగు పులిమి.. లబ్ధి పొందాలని జగన్ ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. గతంలో ప్రభుత్వ వ్యవస్థలు పని చేయడం మానేశాయనేందుకు మదనపల్లె ఘటనే నిదర్శనమని అన్నారు.