AP Latest Weather Report: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారింది. కానీ ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర(Uttarandhra)తోపాటు కోస్తా జిల్లాల్లో ఐదారు రోజులుగా ఎడతెరిలేకుండా వానలు పడుతున్నాయి. ముఖ్యంగా గోదావరి(Godavari) జిల్లాలు వానలు, వరదలతో వణికిపోతున్నాయి. మరో మూడురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది.


వదలని వరుణుడు
తెలుగు రాష్ట్రాలపై వరుణుడు కరుణ చూపడం లేదు. జోరువానలతో జనజీవనం స్థభించింది. ఏపీలో దాదాపు వారంరోజులుగా రోజూ వర్షం కురుస్తూనే ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, గోదావరి(Godavari) జిల్లాలో కుండపోత వానలు కురవగా..దక్షిణ కోస్తా జిల్లాలపైనా తీవ్ర ప్రభావం చూపింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పంటపొలాలు నీట మునిగిపోతున్నాయి. తెలంగాణ(Telangana)లోనూ జోరువానలు కురుస్తుండటంతో సరిహద్దు ప్రాంతం ఎన్టీఆర్(NTR) జిల్లాలోనూ వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కట్టలేరు ఉద్ధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. వీరులపాడు-నందిగామ మధ్య వైరా వాగు పోటెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి కృష్ణాజి(Krishna Distric)ల్లావ్యాప్తంగానూ జోరుగా వానలు కురుస్తున్నాయి. పామర్రు, తోట్లవళ్లూరు మండలాల్లో పంటపొలాలు నీట మునిగాయి. గుంటూరు(Guntur), బాపట్ల జిల్లాలోనూ వరుణుడు ప్రతాపం చూపాడు. ఉభయగోదావరి జిల్లాల ప్రజల పాట్లు వర్ణణాతీతం. తూర్పుగోదావరి(Esat Godavari), పశ్చిమగోదావరి(Wsest Godavari), కోనసీమ(Konasema) జిల్లాల్లో వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. వాగులు, కాల్వలు పొంగి రాకపోకలు నిలిచిపోవడంతో పడవులపై ప్రయాణం సాగిస్తున్నారు. కొవ్వాడ, ఎర్ర కాల్వలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద తీవ్ర దృష్ట్యా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాఠశాలలకు మరో రెండురోజులపాటు సెలవులు ఇచ్చారు.


వరద ఇక్కట్లు
గ్రామాల్లోకి వరదనీరు పోటెత్తడంతో ప్రజలు తీవ్ర ఇ్బబందులు ఎదుర్కొంటున్నారు. కనీసం తాగడానికి మంచినీరు కూడా దొరకడం లేదు. పశువులకు గ్రాసం కరవైంది.  విలీన మండలాల్ల పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. గోదావరి మహోగ్రరూపంతో ముంపుభయం వెంటాడుతోంది. దేవీపట్నం(Devipatnam)లోని గండిపోశమ్మ ఆలయం పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది.


మరో మూడురోజులు వానలు
అల్పపీడణ ద్రోణి ప్రభావంతో మరో మూడురోజులు వానలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికలతో జనం భయపడుతున్నారు. ఉత్తర కోస్తాంధ్రలో మోస్తరు వర్షం నుంచి తేలకపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. ఒకటి, రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కూడా కురవొచ్చు. గాలులు మాత్రం బలంగా వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. దక్షిణ కోస్తాంధ్రలోనూ మోస్తరు నుంచి తేలకపాటి జల్లులుపడొచ్చని వాతావరణశాఖ హెచ్చరించింది. రేపు, ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చు.


ప్రభుత్వం స్పందన
జోరువానలు,వరదలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద ప్రభావిత జిల్లాల అధికారులతో సీఎం చంద్రబాబు నిరంతరం సమీక్షిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రాణనష్టం జరగడానికి వీల్లేదని...ముంపు ప్రాంత ప్రజలకు నచ్చజెప్పి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అలాగే క్షేత్రస్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటించి బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. పంట నష్టం  అంచనాలు వేసిన తర్వాత అందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు విపత్తు నివారణ దళాలను సిద్ధం చేశారు. వరద నీటిలో ప్రయాణం చేయవద్దని...పొంగుతున్న వాగులను ప్రమాదకరంగా దాటవద్దని ప్రభుత్వం హెచ్చరించింది.