Godavari Floods: గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీటితో పోటెత్తుతోంది. పదిలక్షల క్యూసెక్కులకుపైగా వరదనీరు వస్తుండటంతో ధవళేశ్వరం ప్రాజెక్ట్‌ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు..


వదలని వరుణుడు
జోరువానలతో ఉమ్మడి గోదావరి(Godavari) జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదనీటితో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. లంకగ్రామాల్లోకి నీరు చేరి పంటపొలాలన్నీ నీటమునిగాయి. బాహ్య ప్రపంచంతో లంకగ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. వాగులు, వంకలు పొంగిపొర్లి వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ధవళేశ్వరం(Dhavaleswaram) వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కోనసీమలో వరి పంట మొత్తం నీట మునిగింది. మూడురోజులుగా  వరద నీటిలోనే పంట నానిపోవడంతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంది. డ్రెయిన్‌లు బాగుచేయకపోవడంతో మురుగునీరు బయటకి పోయే పరిస్థితులు లేవు. 


గోదావరికి వరదపోటు
తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు తోడు..ఛత్తీస్‌గడ్‌ నుంచి భారీగా వరదనీరు గోదావరిలోకి వచ్చి చేరుతుండటంతో కోనసీమవాసులు(Konasema) బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పోలవరం(Polavaram) ప్రాజెక్ట్ ఎగువ కాపర్‌డ్యాంను తాకుతూ గోదావరి ప్రవహిస్తోంది. ధవళేశ్వరం వద్ద ఇన్‌ఫ్లో 10 లక్షల క్యూసెక్కులు దాటగా...అంతే మొత్తంలో నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సహాయ చర్యల్లో పాల్గొనేందుకు విపత్తుల నిర్వహణ సంస్థ బృందాలను సిద్ధం చేసింది. గోదావరి మహోగ్రరూపంతో లంకగ్రామాల ప్రజలు కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు. ఏ క్షణంలో వరద వచ్చి మీదపడిపోతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే లంకల్లోని భూములన్నీ నీట మునిగాయి. కూరగాయలు, ఆకుకూరలు తొటలన్నీ గోదావరి(Godavari) నీటిలో కలిసిపోయాయి. గోదావరి ఉద్ధృతికి లంక భూములు కోతకు గురవుతోంది.


పొంగుతున్న ఉపనదులు
మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో శబరి(Sabari), ప్రాణహిత(Pranahitha), ఇంద్రావతి(Indravathi),తాలిపేరు(Taliperu), కిన్నెరసాని(Kinerasani) ఉపనదులు పొంగిపొర్లుతున్నాయి. ఎగువున ఉన్న ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వీటికి తోడు వాగులు, వంకల నుంచి పెద్దఎత్తున నీరు గోదావరిలోకి చేరుతోంది. పోలవరం ప్రాజెక్ట్‌ 48 గేట్లను ఎత్తి దిగువు నీటిని విడుదల చేస్తున్నారు. శబరి ఉద్ధతికి చింతూరు(Chinthuru), వీఆర్‌పురం(V.R.Puram) మండలంలో రాకపోకలు నిలిచిపోయాయి. కుయినూరు వాగు ఉద్ధృతితో ఏపీకి ఒడిశాకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు గ్రామాల ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. వేలేరుపాడు మండలం జలదిగ్భందంలో చిక్కుకుంది. 30 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.


అధికారులు అప్రమత్తం
గోదవరికి వరద పోటెత్తడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లంకగ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గోదావరికి వరద మరింత పెరిగే అవకాశాలు ఉండటంతో బలహీనంగా ఉన్న ఏటిగట్లు వద్ద ఇసుక బస్తాలను సిద్ధం చేశారు. నీట మునిగిన లంకగ్రామాలకు బోట్లు ద్వారా రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేశారు. అటు బ్రిడ్జిలు తెగిపోయి రాకపోకలు నిలిచిన ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు చేస్తున్నారు. వాహన ప్రయాణికులు వరద నీటిని దాటకుండా తిప్పి వెనక్కి పంపిస్తున్నారు. ధవళేశ్వరం వద్ద వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు గమినిస్తూ...దిగువకు విడుదల చేస్తున్నారు. ఏటిగట్టు ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.