Andhra Pradesh Rains News - రాజమండ్రి: ఎగువనుంచి వెల్లువలా వచ్చి చేరుతోన్న వరదనీటితో గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీనికి తోడు ఏజెన్సీ ప్రాంతాల్లోనూ మూడు రోజులుగా ఎడతెరిపిలేని భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో భద్రాచలం వద్ద ఆదివారం మధ్యాహ్నం నాటికి 43.10 అడుగుల స్థాయి నీటిమట్టానికి వరద నీరు చేరింది. భద్రాచలం వద్ద ఒకటో ప్రమాదహెచ్చరిక జారీ చేశారు అధికారులు. శబరి నది నుంచి కూడా భారీగా వరద నీరు గోదావరిలోకి చేరుతోంది.. మరోపక్క ఏజేన్సీ ప్రాంతాలైన విలీన మండలాల్లో భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. విలీన మండలాల్లో గ్రామాలను కలిపే పలు రోడ్లు భారీ వర్షాలుతో వాగులు పొంగి రోడ్లుకు గండ్లు పడే పరిస్థితి తలెత్తింది. వీఆర్‌ పురం, చింతూరు, కూనవరం తదితర ప్రాంతాల్లో రోడ్లు గండ్లు పడ్డాయి. సోకిలేరు వాగు పొంగి ఆంధ్రా, ఒడిస్తా సరిహద్దులుగూండా వెళ్లే జాతీయ రహదారి గండిపడిరది. దీంతో ఇటువైపుగా రాకపోకలు సాగించే వాహనాలు భారీగా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. 
ధవళేళ్వరం వద్ద పెరుగుతోన్న గోదావరి..
ఎగువ ప్రాంతాలనుంచే కాకుండా ఏజన్సీ ప్రాంతాలనుంచి కూడా భారీగా వరద నీరు గోదావరిలోకి చేరుతుండడంతో ధవళేశ్వరం సర్‌ ఆర్దర్‌ కాటన్‌ దొర బ్యారేజీ వద్ద భారీగా వరద నీరు చేరింది. ఇన్‌ఫ్లో 7,72,371 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా దానిని యాధాతధంగా సముద్రంలోకి వదులుతున్నారు అధికారులు.. ఇక్కడ సాయంత్రం నాటికి 10 అడుగుల స్థాయి నీటిమట్టంకు చేరుకుంది.  ఇదే కొనసాగితే రేపు మద్యాహ్నం నాటికి ఒకటో ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే ఇసుక డ్రెజ్జింగ్‌కోసం వినియోగించే మత్స్యకారుల పైబర్‌ బోటు ఒకటి వరద నీటిలో కొట్టుకువచ్చి ధవళేశ్వరం బ్యారేజీలో చిక్కుకుంది. 
ముంపు ముప్పులో కోనసీమ ప్రాంతం..
ధవళేశ్వరం దిగువన గౌతమి, వశిష్టా, వైనతేయ వృద్ధగౌతమి నదీపాయలు వరదనీటితో ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లావ్యాప్తంగా అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ వరద ప్రభావిత మండలాల్లో అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 45 ఆవాస ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యే అవకాశాలున్నందున ఆగ్రామాల్లో ప్రత్యేకాధికారులను నియమించారు. ఆప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు, ఆహార సదుపాయాలతోపాటు మెకనైజ్డ్‌ బోట్లు సిద్ధం చేశామని తెలిపారు. 
కాజ్‌వేలపై చేరిన వరదనీరు...
వశిష్టా నదీపాయకు వరద పోటెత్తడంతో పి.గన్నవరం మండలం చాకలిపాలెం వద్ద కనకాయిలంక కాజ్‌వే పైకి వరదనీరు పోటెత్తింది. దీంతో వరదనీటిలోనే ప్రజలు రాకపోకాలు సాగిస్తున్నారు. సోమవారం నాటికి అయినవిల్లి మండల పరిధిలో ఎదురుబిడియం కాజ్‌వే కూడా నీటమునిగే అవకాశాలున్నాయి. మరో పక్క అప్పనపల్లి, శానపల్లిలంక, అప్పనరామునిలంక తదితర నదీపరివాహక ప్రాంతాల్లో కొబ్బరితోటల్లో ఇప్పటికే వరదనీరు ముంచెత్తింది.

భారీ వర్షాలతో అతలాకుతలం..
వరదల పరిస్థితి ఓపక్క ఆందోళన కలిగిస్తుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈప్రభావంతో ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. గిరిజనుల జనజీవనానికి వారి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మరోపక్క ఉమ్మడి తూర్పుగోదావరిలో భారీ వర్షాలకు 24 వేట హెక్టార్లలో వరపంటకు సంబందించి మడులు ముంపుకు గురయ్యాయని అధికారులు ప్రామధమిక అంచానా వేశారు. 300 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటల్లింది. వరిచేలల్లో ముంపు నీరు దిగక అన్నదాతలు అవస్తలు పడుతున్నారు. ఇదిలా ఉంటే పలు లోతట్టు ఆవాస ప్రాంతాలు కూడా భారీ వర్షాలకు ముంపుకు గురైన పరిస్థితి కనిపిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాలే కుండా లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురవ్వడంతో అక్కడా అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్లు ఆదేశించారు.

సోమవారం విద్యాసంస్థలు, గ్రీవెన్స్‌డే సెలవు..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా సోమవారం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు జిల్లా కలెక్టర్లు. అదేవిధంగా సోమవారం జిల్లా కలెక్టరేట్లలోనూ, మండల కేంద్రాల్లో నిర్వహించే గ్రీవెన్స్‌డేను రద్దుచేసినట్లు అధికారులు తెలిపారు. అధికారులకు సెలవులు రద్దుచేసినట్లు చెప్పారు. జిల్లా కేంద్రాల్లో అత్యవసర సేవలు కోసం కాల్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడిరచారు. రాబోయే 48 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు.