Floods in AP: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వరదల కారణంగా గోదావరిలో నీటి ప్రవాహం పెరుగుతోంది. పోలవరం వద్ద గోదావరి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతుంది. దీంతో పోలవరం ముంపు గ్రామాలు ప్రమాదపు అంచున ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. దాదాపు 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా జనజీవనం స్తంభించిపోయింది. పోలవరం ముంపు గ్రామాల వాసులు భయాందోళనలో ఉన్నారు. పోలవరం నిర్వాసితులు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 


పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వేకు ఉన్న 48 గేట్ల నుంచి 7,86,680 క్యూసెక్కుల వరదనీరు దిగువకు విడుదల చేశారు. వరదల కారణంగా గండి పోచమ్మ ఆలయం పూర్తిగా నీట మునిగింది. గుబ్బల మంగమ్మ ఆలయాన్ని ఆలయ కమిటీ అధికారులు మూసివేశారు.


భారీ వరదలో ఏలూరు కలెక్టర్ సాహసం
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఏలూరు జిల్లా పోలవరం విలీన మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ గ్రామాలకు వాహనాలు కూడా వెళ్లే పరిస్థితి ఏర్పడింది. దీంతో జిల్లా కలెక్టర్ సెల్వి బైక్ మీద తిరుగుతూ అధికారులను పరుగులు పెట్టించారు.


క్షేత్రస్థాయిలో పరిస్థితులను చూస్తూ అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలిస్తూ ముందుకు సాగారు. జిల్లా కలెక్టర్ గా ఆఫీసులో ఉండి వరద పరిస్థితిని సమీక్షించాల్సిన కలెక్టర్ స్వయంగా గ్రామాల్లో పర్యటించడంతో పోలవరం నిర్వాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేలేరుపాడు ప్రాంతంలో వరద ముంపులో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ ని సిద్ధం చేసి సురక్షితంగా రక్షించారు. జిల్లా ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం నింపుకున్నారు. ముంపు ప్రాంతాల వాసులకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.