Bharat Ram campaign vehicle Fire Case : రాజమండ్రి మార్గాని భరత్ రామ్ కు చెందిన ప్రచార వాహనానికి నిప్పు పెట్టిన కేసులో పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు. రాజమండ్రి నగరంలోని వీఎల్ పురానికి చెందిన దంగేటి శివాజీ పనికి పాల్పడినట్లుగా పోలీసులు ఆధారాలతో సహా అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పరిాచరు. ఈ దంగేటి శివాజీ మాజీ ఎంపీ భరత్ రామ్ ముఖ్య అనుచరుడే. ఎన్నికల ప్రచారంలోనూ చురుకుగా పాల్గొన్నారు. మరి ఎందుకు నిప్పు పెట్టారంటే.. ఓడిపోయారన్న సానుభూతి భరత్ రామ్ కు రావాలన్న ఉద్దేశంతో తాను వాహనాన్ని తగులబెట్టానని పోలీసులకు చెప్పారు.
భరత్ రామ్ ప్రచార వాహనానికి నిప్పు పెట్టి అనుచరుడే
భరత్ రామ్ వాహనానికి నిప్పు పెట్టిన విషయం సంచలనం సృష్టించింది. టీడీపీ నేతలే ఈ పని చేశారని భరత్ రామ్ ఆరోపించారు. అమరావతికి వెళ్లి నేరుగా డీజీపీ ద్వారకా తిరమల రావును కలిసి దర్యాప్తు చేయాలని కోరారు. పోలీసులు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు. సీసీ ఫుటేజీ ఇతర ఆధారాలతో సహా దంగేటి శివాజీని అరెస్టు చేయడంతో కేసు మిస్టరీ వీడింది. నిందితుడు యూట్యూబ్‌లో వీడియో చూసి.. ముందుగా పెట్రోల్ పోసి.. తర్వాత దోమల కాయిల్‌ను అంటించి.. వాహనం దగ్గర పెట్టి వెళ్లాడు. వాహనం కాలిపోయిన తర్వాత శివాజీ..ఎంపీ భరత్ తండ్రి నాగేశ్వరరావుకు ఫోన్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. దంగేటి శివాజీపై ఐపిసి సెక్షన్ 435 కింద కేసు నమోదు చేసి పోలీసులు రిమాండ్ కు తరలించారు.
ఈవీఎం ధ్వంసంపై జగన్ చేసిన కామెంట్స్ - ఈసీకి ఫిర్యాదు చేయనున్న టీడీపీ
తన అనుచరుడు అయితే తన వాహనానికి నిప్పెందుకు పెడతారన్న ఎంపీ
అయితే టీడీపీ నేతలపై ఆరోపణలు చేసిన భరత్ రామ్‌కు ఈ కేసు చిక్కుముడి వీడటంతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. దీంతో ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పుడల్లా ఎన్నికలు లేవు తనకు సానుభూతి ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. దంగేటి శివాజీ వైసీపీ కార్యకర్త కాదని.. తమ అనుచరుడు కాదని మార్గాని భరత్ స్పష్టం చేశారు. మాపై అభిమానం ఉంటే మా ఆస్తి ఎందుకు ధ్వంసం చేస్తారని ఆయన ప్రశ్నించారు. కావాలంటే తాను మార్కండేయ స్వామి ఆలయంలో ప్రమాణానికి సిద్దమని.. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రమాణానికి వస్తారా అని సవాల్ చేశారు.
ఆలయంలో ప్రమాణం చేస్తానని సవాల్
గత ఎన్నికలలో రాజమండ్రి ఎంపీగా ఉన్న భరత్ రామ్..రాజమండ్రి సిటీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే ఘోరంగా ఓడిపోయారు. కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన ఆదిరెడ్డి శ్రీనివాస్‌కు లక్షా 23వేలకుపైగా ఓట్లు రాగా.. భరత్ రామ్‌కు కేవలం 51 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆయన 71 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. మెజార్టీ కన్నా భరత్ రామ్ కు వచ్చిన ఓట్లే తక్కువ. ఈ ఓటమిపై భరత్ రామ్ ఆవేదన చెందుతున్నారు. ఈ సమయంలో ఆయన కారును ఆయన అనుచరుడే తగులపెట్టడం సంచలనంగా మారింది. సమర్థించుకోలేక.. ప్రమాణాలు పేరుతో నాటకాలు ఆడుున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.