TDP To Complain To EC On Jagan's Comments: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈవీఎం ధ్వంసంపై చేసిన వ్యాఖ్యలను కార్నర్ చేసే పనిలో టీడీపీ పడింది. సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ రోజు అప్పటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గేటు పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేశారు. ఈ కేసుతో పాటు మరికొన్ని కేసుల్లో అరెస్టు అయిన ఆయన ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయన్ను పరామర్శించేందుకు జైలుకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ఈవీఎంలను ధ్వంసం చేయడం తప్పే కాదన్నట్లు ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ, జనసేన నేతలు ఘాటుగా స్పందించడంతో పాటు ఈసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
జగన్ ఏమన్నారంటే.?
'గ్రామంలో ఉన్న ఎస్సీలు ఓటు వేసే పరిస్థితి లేకపోవడంతో, మా ఎమ్మెల్యే ఎస్పీకి ఫోన్ చేసినా స్పందన లేకపోయింది. సున్నితమైన ఏరియాలో ఉన్న ఆ బూత్‌లో కేవలం ఒక హోంగార్డును సెక్యూరిటీగా పెట్టారు. అక్కడ అన్యాయం జరుగుతుండడంతో ఎమ్మెల్యే లోపలికి వెళ్లి ఈవీఎం పగలగొట్టాడు. వైసీపీకే ఓట్లు పడుతుంటే ఎమ్మెల్యే వెళ్లి ఈవీఎంను పగలగొట్టాల్సిన అవసరం ఏముంది. అక్కడకి వెళ్లినప్పుడు జరుగుతున్న అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవీఎం పగలగొట్టాడు. ఈ కేసులో బెయిల్ కూడా వచ్చింది. ఇవాళ తను లోపల ఉంది ఈవీఎంను పగలగొట్టిన కేసులో కాదు' అని జగన్ జైలు బయట మీడియాతో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీతోపాటు జనసేన నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని, అందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని తల్లి, చెల్లి దూరం పెట్టారని, ప్రజలు ఎందుకు ఈ భారం భరించడం అని భావిస్తున్నారన్నారు. అందుకే సార్వత్రిక ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే ఇచ్చినట్లు విమర్శించారు. పులివెందుల ప్రజలు కూడా ఈ సైకోని ఎంత తొందరగా వదిలించుకుంటే, ఆ ప్రాంతానికి అంత మంచిదని అన్నారు. ఈవీఎం ధ్వంసం చేయడాన్ని సమర్ధించడం ఏమిటని..? టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. 'ఈవీఎం పగలగొట్టి హత్యాయత్నం చేస్తే తప్పు లేదా. ఐదేళ్లలో లెక్కకు మించి పాపాలు చేశారు. కాబట్టి ఈరోజు ఫలితం అనుభవిస్తున్నారు' అని మండిపడ్డారు. జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన నేత నాగబాబు కూడా స్పందించారు. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా..? అని ప్రశ్నించారు. కోపం వచ్చి ఈవీఎంలు పగలగొట్టారా..? ఒకవేళ నిజంగా అన్యాయం జరుగుతుంటే..? అక్కడ పోలీస్ సిబ్బంది లేరా..? ఎన్నికల సిబ్బంది లేరా..? ఆర్వో లేరా..? అని ప్రశ్నించారు. తీరు మారకపోతే ఈసారి సింగిల్ డిజిట్ కట్టబెట్టడానికి ప్రజల సిద్ధంగా ఉంటారని హెచ్చరించారు.
ఈసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న టీడీపీ
ఈవీఎం ద్వంసం వ్యవహారంపై జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు టిడిపి సిద్ధమవుతోంది. ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ, మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి ఈవీఎం ధ్వంసం చేయడానికి సమర్థించేలా చేసిన వ్యాఖ్యలను తీసి దృష్టికి తీసుకెళ్లాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఒకటి, రెండు రోజుల్లో ఎన్నికల సంఘం అధికారులను కలిసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌తో సహా ఫిర్యాదు చేయనున్నారు. ఎన్నికల సంఘ పనితీరును కించపరిచేలా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయంటూ టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫిర్యాదుపై ఈసీ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.