Minister Vidadala Rajini : పేదలకు క్యాన్సర్  వైద్యాన్ని అందించడంలో ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేయబోతుందని ఏపీ మంత్రి విడదల రజిని తెలిపారు. శనివారం ఏపీ శాక్స్‌, ఆయుష్మాన్‌ భార‌త్‌, క్యాన్సర్ చికిత్సలో నూత‌న విధానం అంశాల‌పై మంత్రి విడ‌ద‌ల ర‌జిని అధికారుల‌తో  స‌మీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ 2030 క‌ల్లా ప్రతి 50 కిలోమీట‌ర్ల ప‌రిధిలో ఒక క్యాన్సర్ చికిత్సా కేంద్రం ఏర్పాటు, విశాఖ‌ప‌ట్టణం, తిరుప‌తి, విజ‌యవాడ ప్రాంతాల్లో మూడు క్యాన్సర్ కేర్ సెంట‌ర్ల ఏర్పాటు, తిరుప‌తిలో చిన్న పిల్లల క్యాన్సర్ కేర్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుకు చ‌ర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కోట్లాది రూపాయ‌ల ఖ‌ర్చుతో క్యాన్సర్ చికిత్సా ప‌రిక‌రాల‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఈ మూడేళ్లలో సుమారు వెయ్యి కోట్ల రూపాయ‌ల వరకు క్యాన్సర్ రోగుల‌ చికిత్స కోసం ఖ‌ర్చు చేశామ‌ని వివ‌రించారు. అన్ని విధాలా క్యాన్సర్ బాధితుల‌కు రాష్ట్ర ప్రభుత్వం అండ‌గా ఉంటోంద‌న్నారు. 


చిత్తూరు జిల్లాలో పైలెట్ ప్రోగ్రామ్ 


క్యాన్సర్ రోగులు వైద్యం కోసం ప‌క్క రాష్ట్రాల‌కు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత మ‌న‌పైనే ఉంద‌ని  మంత్రి విడదల రజిని అన్నారు. జ‌గ‌న‌న్న ఆశ‌యాలు, ప్రభుత్వ ఆకాంక్షల‌కు అనుగుణంగా అంతా ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధికి చికిత్సలో ఎన్నో సంచ‌ల‌నాలు తీసుకొస్తున్న ఘ‌న‌త సీఎం జగన్ కు ద‌క్కుతుంద‌న్నారు. రాష్ట్రంలోని ప్రజ‌లంద‌రికీ క్యాన్సర్ టెస్టులు చేస్తామ‌ని, ఇప్పటికే చిత్తూరు జిల్లాను పైలెట్‌గా తీసుకొని ప‌రీక్షలు నిర్వహిస్తున్నామ‌ని వివ‌రించారు. క్యాన్సర్ రోగాన్ని తొలి ద‌శ‌లో గుర్తిస్తే నిర్మూలించ‌డం చాలా తేలిక అని, అందుకే త‌మ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంద‌ని తెలిపారు. ఎంతో ఖ‌ర్చుతో కూడుకున్న విష‌య‌మే అయినా సీఎం జగన్ ధైర్యంగా ముంద‌డుగు వేస్తున్నార‌ని చెప్పారు.


పాలియేటివ్ కేర్‌కు అనుమ‌తి


రాష్ట్రంలోని అన్ని వైద్య క‌ళాశాల‌ల ఆస్పత్రుల్లో క‌నీసం ఐదు ప‌డ‌క‌ల సామ‌ర్థ్యంతో పాలియేటివ్ కేర్ యూనిట్లు ఏర్పాటుచేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యద‌ర్శి న‌వీన్‌ కుమార్ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మంత్రి ర‌జిని వెంట‌నే స్పందించి ఏర్పాటు చేసేలా చ‌ర్యలు తీసుకోవాల‌ని డీఎంఈ విభాగం అధికారుల‌ను ఆదేశించారు.  సీఎం జగన్ వైద్య ఆరోగ్యశాఖ‌కు ఎన్ని నిధులు ఇచ్చేందుకైనా సిద్ధంగా ఉన్నార‌ని తెలిపారు. చావుబ‌తుకుల్లో ఉన్నవారికి భ‌రోసా, ఉప‌శ‌మనాన్ని క‌ల్పించే పాలియేటివ్ కేర్ యూనిట్లను వెంట‌నే ఏర్పాటుచేయాల‌ని చెప్పారు. వీటి నిర్వహ‌ణ‌కు ఎన్హెచ్ఎం నిధులు వాడుకోవాల‌ని చెప్పారు. అన్ని జిల్లా ఆస్పత్రులు, ప్రాంతీయ ఆస్పత్రుల్లో బ్లడ్ బ్యాంకులు, అన్ని సీహెచ్‌సీల్లో బ్లడ్ స్టోరేజి యూనిట్ల ఏర్పాటు విష‌యాన్ని ప‌రిశీలించాల‌ని అధికారుల నుంచి అభ్యర్థన రాగా మంత్రి సానుకూలంగా స్పందించారు. అన్ని ఆస్పత్రుల్లో వాటి ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. మెడిక‌ల్ క‌ళాశాల‌ల అనుబంధ ఆస్పత్రుల్లో అత్యవ‌స‌ర విభాగాల‌ను మ‌రింత ప‌టిష్టం చేయాల‌ని చెప్పారు.


స‌చివాల‌యం వ్యవ‌స్థతో ఎంతో మేలు


ఇప్పటి వ‌ర‌కు ఏపీలో 3.21 కోట్ల మందికి ఆయుష్మాన్ భార‌త్ హెల్త్ అకౌంట్ నంబ‌ర్లు ఇవ్వగ‌లిగామ‌ని, స‌చివాల‌య వ్యవ‌స్థ వ‌ల్లనే ఇది సాధ్యమైంద‌ని మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. హెచ్ఐవీ నియంత్రణ‌కు సంబంధించి ఏపీ శాక్స్ మ‌రింత చురుగ్గా ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు. అవ‌గాహ‌న కార్యక్రమాల‌ను పెద్ద స్థాయిలో పెంచాల‌ని చెప్పారు. ప్రతి విలేజ్ హెల్త్ క్లినిక్‌ల‌లో హెచ్ఐవీ అవ‌గాహ‌న పోస్టర్లు ఏర్పాటుచేయాల‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా అధికారుల‌తో క‌లిసి హెచ్ఐవీ అవగాహ‌న పోస్టర్లు, వాల్ బోర్డులు ఆవిష్కరించారు.