Pawan Kalyan : వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 47-67 సీట్లు వచ్చే అవకాశం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో  లీగస్ సెల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... వెంటనే అధికారం చేపట్టాలనే ఆలోచన తనకు లేదన్నారు.  ఎన్ని సమస్యలు ఎదురైనా ప్రజాసేవలో ఉంటానన్నారు. సమస్యలకు భయపడితే ఎదురించి ముందుకెళ్తానని చెప్పారు. అణగారిన వర్గాలకు జనసేన అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఎదురైనా సమస్యలు పరిష్కారిస్తారనే ఆలోచించి అప్పుడు టీడీపీకి మద్దతిచ్చామని పవన కల్యాణ్ వెల్లడించారు. 


టీడీపీ గుడ్డిగా మద్దతివ్వలేదు 


 2014లో టీడీపీకి గుడ్డిగా మద్దతు ఇవ్వలేదని పవన్ కల్యాణ్ అన్నారు. విభజన తర్వాత ఇబ్బందుల పరిష్కారంపై ఆలోచించి పెద్దల సూచనతో టీడీపీకి మద్దతిచ్చామని స్పష్టం చేశారు. కానీ ఇవాళ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందన్నారు. చట్ట సభల్లో మాట ఇచ్చి వెనక్కి తీసుకుంటే విలువేముంటుందని పవన్ కల్యాణ్ అన్నారు. అప్పుడు అమరావతిని రాజధానిగా ఒప్పుకుని ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నారని ఆరోపించారు. మాట నిలబెట్టుకోనప్పుడు చట్టాలు అమలు చేసే అధికారం ఎక్కడిదని పవన్‌ ప్రశ్నించారు. 


వైసీపీకి 47-67 సీట్లు 


వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 47-67 సీట్లు వచ్చే అవకాశం ఉందని పవన్ కల్యాణ్ జోస్యం చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని వైసీపీకి చట్టాలు చేసే అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు, సేవ చేసేందుకే పార్టీ స్థాపించనని పవన్ కల్యాణ్ వెల్లడించారు. విజయం సాధించేందుకు దెబ్బలు తినడానికి సిద్ధమని స్పష్టం చేశారు. తన జీవితంలో చేసిన మంచి పని పార్టీ పెట్టడమని పవన్ తెలిపారు. 2019లో ప్రజలు ఏ ఉద్దేశంతో వైసీపీకి ఓటు వేశారో కానీ పర్యావసానం ఇప్పుడు అనుభవిస్తున్నారని పవన్ కల్యాణ్‌ వెల్లడించారు. 


10 సీట్లు వచ్చినా మరోలా ఉండేది 


వేగంగా అధికారంలోకి రావడం జనసేన లక్ష్యం కాదని పవన్ కల్యాణ్ అన్నారు. మార్పు కోసమే పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. పార్టీలు నిలబడాలంటే బలమైన సిద్ధాంతాలు ఉండాలన్నారు. 2019 ఓటమి తరువాత పార్టీ వదిలేసి పారిపోతానని చాలా మంది ఆశించారని వారి కోరిక నేరవేరలేదన్నారు. అణగారిన వర్గాలకు అధికారం దక్కేందుకు కృషి చేస్తున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు. గత ఎన్నికల్లో జనసేనకు కనీసం 10 సీట్లు వచ్చినా తమ పోరాటం మరోలా ఉండేదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. 


జనసేన యాత్ర వాయిదా 


"మూడు రాజధానుల పేరుతో వివాదం చేస్తున్నారు. నేడు ఏపీకి  రాజధాని లేకుండా పోయింది. చట్ట సభల్లో మాట ఇచ్చి వెనక్కిపోతే ఇక దానికి విలువేముంది. వేల ఎకరాలు వద్దు చిన్న రాజధాని చాలని అప్పుడే చెప్పాను. ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి 30 వేల ఎకరాలు అవసరం అన్నారు. ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని, అమరావతిని అభివృద్ధి చేస్తానన్నారు.  అధికారంలోకి వచ్చాక మాట తప్పి మోసం చేశారు. జనసేనకు బలమైన స్థానాలు గుర్చించి అక్కడ బాగా పనిచేయాలి.  గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగే అభ్యర్థులను ఎంపిక చేస్తాం. అక్టోబర్‌లో చేపట్టే జనసేన యాత్ర వాయిదా వేస్తున్నాం. పార్టీ బలోపేతంపై అధ్యయనం పూర్తయ్యాక యాత్ర ప్రారంభిస్తాం. త్వరలో నియోజకవర్గాలవారీగా సమీక్షలు నిర్వహిస్తాం." - పవన్ కల్యాణ్  


Also Read : Nara Lokesh Padayatra: ఏపీలో లోకేష్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్ - ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతారంటే?


Also Read : Ayyannapatrudu: గుడివాడ అమర్ సవాల్‌కు అయ్యన్నపాత్రుడు ఓకే, మంత్రికి మరో ఛాలెంజ్ విసిరిన టీడీపీ నేత