Pawan Kalyan : అప్పులు తెచ్చి అభివృద్ధి చేస్తామంటే రాష్ట్రంగా ఆర్థికంగా ఎప్పుడు నిలదొక్కుకుంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.  మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఐటీ విభాగం సమావేశంలో పవన్ పాల్గొన్నారు. జనసేన అధికారంలోకి వస్తే రాష్ట్రంలోకి ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సమావేశంలో పవన్‌ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ప్రజలను బలహీనపరిచేలా చేయకూదన్నారు.  


ఏపీకి ఐటీ పరిశ్రమలు 


ఐటీ రంగం అంటే హైదరాబాద్‌, బెంగళూరు సిటీలు గుర్తొస్తాయని పవన్ అన్నారు. ఏపీకి ఐటీ పరిశ్రమలు రావాల్సిఉందని, జనసేన అధికారంలోకి వస్తే ఐటీ పరిశ్రమలు తీసుకురావడంపై దృష్టిపెడతామన్నారు. రాయలసీమలో పర్యటించినప్పుడు అక్కడి యువత బెంగళూరుకు వెళ్లిపోతున్నారని తెలిసిందన్నారు. అక్కడి యువత ఏపీలో ఐటీ రంగాన్ని ఎందుకు అభివృద్ధి చేయడంలేదని ప్రశ్నించారని పవన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తే మిగతా రాష్ట్రాల్లో కన్నా ఎక్కువ స్థాయిలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. 


సీఎం జగన్ కు సవాల్ 


"ఐటీ పాలసీ అంటే ఎన్నికల సమయంలో ఓట్ల కోసం మభ్యపెట్టడం కాదు. దావోస్‌ వెళ్లి ఫొటోలు దిగి వస్తే పెట్టుబడులురావు. సీఎంకి జనసేన తరఫున సవాల్ చేస్తున్నాం. జగన్‌ సీఎం అయిన తర్వాత రాష్ట్రానికి ఎంత పెట్టుబడులు వచ్చాయో చెప్పగలరా? రాష్ట్రంలో ఎంత మందికి ఉపాధి కల్పించారు? ఏదో అద్భుతం చేసేద్దామని నేను పార్టీ పెట్టలేదు. అనుభవం లేకుండా వస్తే వైసీపీ ప్రభుత్వంలాగా ఉంటుంది. పదవి ఎప్పుడూ వెతుక్కుంటూ రావాలి కానీ పదవి వెంట పడకూడదు. పదవి అనేది మన ప్రయాణంలో భాగంగా ఉండాలి అంతే. స్థాయి, స్థోమత ఉంటే ప్రజలు ఆ అవకాశం కల్పిస్తారు." పవన్‌ కల్యాణ్‌ 


వైసీపీకి అధికారమే పరమావధి


సీఎం జగన్ అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పులమయం చేస్తున్నారని పవన్ ఆరోపించారు. వైసీపీ నేతలకు అధికారమే పరమావధని అందుకు ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారని మండిపడ్డారు. జగన్ నోటికి వచ్చిన హామీలు ఇచ్చి ఓట్లు‌ వేయించుకున్నారని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇసుక విషయాలలో మోసం చేశారన్నారు. సంక్షేమ పథకాలకు జనసేన వ్యతిరేకం కాదని, అయితే సంక్షేమ పథకాలు ప్రజలకు ఊతమిస్తే సరిపోతుందన్నారు. భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బలమైన లక్ష్యంతో జనసేన ముందుకు‌ వెళ్తుందని పవన్ అన్నారు. 


అలా అయితే జనసేనలోకి రావొద్దు


ఫ్రీడమ్ ఫర్ మిడ్ నైట్ పుస్తకాన్ని చదివాక దేశం కోసం ఏదైనా చేయాలన్న ఆలోచన వచ్చిందని పవన్ కల్యాణ్ అన్నారు. తాను పార్టీ పెడతానని ఎప్పుడూ అనుకోలేదన్నారు. రాబోయే తరాలకు బాధ్యత తెలియజేయడానికి జనసేన పెట్టానన్నారు. ఒక్క ఎన్నిక కోసమే అయితే ఎవరూ జనసేనలోకి రావొద్దని పవన్ అన్నారు. కోట్లాది మందికి నిర్దేశం‌‌ చేయడమే జనసేన లక్ష్యమన్నారు. 


Also Read : Pawan Kalyan Yatra : అక్టోబర్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కల్యాణ్ టూర్


Also Read : Vijayawada TDP MP : బెజవాడ బరిలో నిలిచేదెవరు? టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కొత్త పేరు!