Pawan Kalyan Yatra : జనసేన ఐటీ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం మంగళగిరిలో జరిగింది. ఈ ఐటీ సమ్మిట్‌లో 600 మంది నిపుణులు పాల్గొన్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని క్రియాశీల కార్యకర్తల నమోదు కార్యక్రమాన్ని జనసేన చేపట్టిందన్నారు. పార్టీ బలోపేతం కోసం పనిచేసే విభాగాల్లో ఐటీ విభాగం కీలకమన్నారు. ఐటీ విభాగంలో ఉన్న ప్రతి ఒక్కరూ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేసే విధంగా పనిచేయాలన్నారు. రాజకీయాల్లో సోషల్ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తోందన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అక్టోబర్ 5 నుంచి యాత్ర ప్రారంభిస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కల్యాణ్ పర్యటనలు ఉంటాయని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
యువతి భవిష్యత్తు నాశనం చేస్తున్నారు
వైసీపీ ప్రభుత్వం సంక్షేమం అంటూ అభివృద్ధిని విస్మరించిందని నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులలు రాకుండా చేసి యువత భవిష్యత్తును నాశనం చేసిందని ఆరోపించారు. జనసేన సరికొత్త ఐటీ పాలసీతో ముందుకు వస్తుందన్నారు. ఈ పాలసీ రాష్ట్ర అభివృద్ధికి, ఐటీ రంగ విస్తరణకు ఉపయోగపడుతోందన్నారు. పారిశ్రామిక వేత్తలను ఆకర్షించేలా ఐటీ పాలసీ ఉంటుందన్నారు. జనసేన మేనిఫెస్టోలో ఐటీ రంగ అభివృద్ధికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఐటీలో హైదరాబాద్ అభివృద్ధి చూస్తుంటే, ఏపీ ప్రభుత్వం ఎందుకలా చేయలేకపోతుందని బాధ కలుగుతుందని నాదెండ్ల మనోహర్ అన్నారు.
ఐటీ రంగం కీలకం
"ఏపీలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తుందని ఐటీ రంగమే. దేశం గర్వించే స్థాయిలో తెలుగు వారు దేశ విదేశాల్లో పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో దేశంలో ఐటీ రంగంలో 250 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నాయన్నది ఒక అంచనా. ఏపీలో పరిస్థితులు రోజు రోజుకీ దారుణంగా మారుతోంది. హైదరాబాద్ ఐటీకి కేంద్రంగా మారింది. రాష్ట్రంలో తిరుపతి, విజయవాడ, విశాఖ వంటి నగరాలు అలాంటి అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయాయి. అమరావతి సహా ఏ నగరంలోనూ పెట్టుబడులు పెట్టే సౌకర్యాలు కల్పించలేకపోయింది ఏపీ ప్రభుత్వం." - నాదెండ్ల మనోహర్
ఐటీ సదస్సు
జనసేన పార్టీ ఐటీ సమన్వయకర్తలు, ఐటీ వలంటీర్ల సమావేశం ఆదివారం మంగళగిరిలో జరిగింది. పార్టీ కార్యక్రమాలకు ఐటీ నిపుణులు సహాయసహకారాలపై ఈ సదస్సులో చర్చిస్తున్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పార్టీ నేతలు, శ్రేణులు సమర్థంగా వినియోగించుకోవడం గురించి ఐటీ నిపుణులు వివరించారు. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్, పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ ఐటీ సెల్ ఛైర్మన్ శ్రీనివాస్ మిరియాల పాల్గొన్నారు. పార్టీ పీఏసీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
స్వాతంత్య్ర వేడుకల్లో పవన్ కల్యాణ్
దేశ స్వాతంత్య్ర అమృతోత్సవ వేడుకలను మంగళగిరి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రేపు (15వ తేదీ) ఉదయం మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వందనం చేయనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
Also Read : TDP Politics: టీడీపీలో వర్గపోరు - కళా వెంకట్రావును తప్పించారా ! అసలేం జరుగుతోంది?