తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కనుల విందుగా జరుగుతున్నాయి. మోహినీ రూపంలో స్వామివారు దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చాడు. మొదట రంగనాయకుల మండపంలో పల్లకిలో మోహినీ అవతారంలో ఉన్న స్వామి వారిని, శ్రీకృష్ణ స్వామి వారిని వేంచేపు చేశారు. అక్కడి నుండి ఊరేగింపుగా కల్యాణ మండపానికి తీసుకెళ్లారు. ఈ అవతారం ద్వారా జగత్తు అంతా మాయా మోహినికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెబుతారని అర్చకులు తెలిపారు.  


రాత్రి 7 గంటలకు విశేష‌మైన గరుడవాహనంపై శ్రీ‌మ‌ల‌య‌ప్పస్వామి కటాక్షించనున్నారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు.


నేడు సీఎం జగన్ పర్యటన


నేడు ఉత్సవాల్లో ప్రధానమైన గరుడవాహన సేవకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. తిరుమలేశుడికి సీఎం జగన్‌ ఇవాళ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకుంటారు జగన్. ఆ తర్వాత అక్కడి నుంచి రోడ్డు ప్రయాణంలో  3 గంటలకు బర్డ్‌ ఆసుపత్రికి వెళ్తారు. చిన్నపిల్లల గుండె శస్త్రచికిత్సల ఆసుపత్రిని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి అలిపిరి వెళ్తారు. అక్కడ భక్తుల విరాళాలతో నిర్మించిన గో మందిరాన్ని ప్రారంభిస్తారు. ఇటీవల అలిపిరి కాలినడక మార్గాన్ని ఆధునీకికరించారు. దానిని సీఎం జగన్ లాంఛనంగాప్రారంభిస్తారు.


సాయంత్రం 6 గంటలకు బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుని.. ఆ తర్వాత శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. తిరుమలేశుడి గరుడవాహన సేవలో పాల్గొంటారు. అనంతరం.. పద్మావతి.. వసతి గృహానికి చేరుకుని అక్కడే బస చేస్తారు. 
నాలుగోరోజున సర్వ భూపాల వాహనంపై..


నాలుగో రోజు ఆదివారం ఉదయం 9 గంటలకు కల్పవృక్ష వాహనం, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనం సేవలు జరిగాయి. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. క్షీర సాగర మథనం నుంచి ఉద్భవించిన కల్పవృక్షం నీడన ఉన్నవారికి ఆకలి దప్పులు ఉండవు, పూర్వజన్మ స్ఫురణ కలుగుతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి.  బ్రహ్మోత్సవాల నాలుగోరోజు రాత్రి శ్రీదేవి, భూదేవులతో మలయప్పస్వామి స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సర్వభూపాలురు అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులూ ఉన్నారు.  తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, పాలకమండలి సభ్యులు వాహన సేవలో పాల్గొన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ఆలయంలోని కల్యాణ మండంలో వాహనసేవ ఏకాంతంగా నిర్వహించారు.


Also Read: Dussehra 2021 : ఆశ్వయుజ మాసం ఎందుకింత ప్రత్యేకం.. శరన్నవరాత్రుల్లో అమ్మవారి ఉపాసన వెనుక ఇంత పరమార్థం ఉందా...


Also Read: TTD Board Meeting: జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టెండర్లు.. టీటీడీ బోర్డు మీటింగ్ లోని నిర్ణయాలివే..