వైవీ.సుబ్బారెడ్డి రెండోసారి ఛైర్మన్‌గా నియమితులయ్యాక తొలిసారిగా టీటీడీ బోర్డు సమావేశం జరిగింది. మొత్తం 24 మంది సభ్యులు, నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యులు ఉండగా సమావేశానికి 18 మంది సభ్యులు నేరుగా హాజరయ్యారు. మిగిలినవారు వర్చువల్‌గా పాల్గొన్నారు. జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టెండర్ల ఖరారు, ఉద్యోగుల ఇళ్ల స్థలాలకు సంబంధించి సమావేశంలో ప్రధానంగా చర్చించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు చేసిన ఏర్పాట్లు, భక్తుల దర్శనాలకు సంబంధించిన అంశాలపైనా సమావేశంలో చర్చ జరిగింది.
జమ్మూలో శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి రూ.17.40 కోట్లతో టెండర్లకు టీటీడీ పాలక మండలి ఆమోదం తెలిపింది. చెన్నై, బెంగళూరు, ముంబయిలో టీటీడీ సమాచార కేంద్రాలు, శ్రీవారి ఆలయాల స్థానిక సలహా మండళ్లకు ఛైర్మన్ల నియామకానికి ఆమోదం తెలిపింది. అలిపిరి కాలిబాట సుందరీకరణ పనులకు రూ.7.50 కోట్లతో టెండర్లకు ఆమోదం తెలుపుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా రాయచోటిలో టీటీడీ కల్యాణమండపం నిర్మాణానికి రూ.2.21 కోట్ల నిధులు కేటాయించింది.
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించేందుకు ఆప్‌కాస్ తరహాలో టీటీడీ కార్పొరేషన్ ఏర్పాటుపై పాలక మండలి నిర్ణయం తీసుకుంటూ టీటీడీ ఉద్యోగుల హెల్త్ ఫండ్‌కు ఆమోదం తెలిపింది. తిరుమలలోని వరాహస్వామి విశ్రాంతి భవనంలో పలు ప్రత్యేక అభివృద్ధి పనులు, మరమ్మతులు చేపట్టేందుకు రూ.2.61 కోట్లు నిధులు కేటాయింపునకు బోర్డు సభ్యులు ఆమోదం తెలిపారు. స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోని సెంటర్ ఫర్ అడ్వాన్స్ రీసెర్చి భవనంలో అదనంగా 4, 5 అంతస్తుల నిర్మాణానికి రూ.4.46 కోట్ల రూపాయలను టీటీటీ కేటాయించింది.
వాహనసేవలు
- 07-10-2021: ధ్వజారోహణం(ఉదయం)- పెద్దశేష వాహనసేవ(సాయంత్రం)
- 08-10-2021: చిన్నశేష వాహనసేవ(ఉదయం)- హంస వాహనసేవ(సాయంత్రం)
- 09-10-2021: సింహ వాహనసేవ(ఉదయం)- ముత్యపుపందిరి వాహనసేవ(సాయంత్రం)
- 10-10-2021: కల్పవృక్ష వాహనసేవ(ఉదయం)-సర్వభూపాల వాహనసేవ(సాయంత్రం)
- 11-10-2021: మోహినీ అవతారం(ఉదయం)- గరుడ వాహనసేవ(సాయంత్రం)
- 12-10-2021: హనుమంత వాహనసేవ(ఉదయం)- గజ వాహనసేవ(సాయంత్రం)
- 13-10-2021: సూర్యప్రభ వాహనసేవ(ఉదయం)- చంద్రప్రభ వాహనసేవ(సాయంత్రం)
- 14-10-2021: రథోత్సవం బదులుగా సర్వభూపాల వాహనసేవ(ఉదయం)- అశ్వ వాహనసేవ(సాయంత్రం)
- 15-10-2021: పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం (ఉదయం)- ధ్వజారోహణం (సాయంత్రం)
Also Read: Dussehra 2021: శరన్నవరాత్రుల సందర్భంగా మీ బంధుమిత్రులకు ఈ కోట్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి..