Loksabha Elections 2024 Chittoor and Tirupati MP Candidates: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈసారి ఎన్నికల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈ జిల్లాలో ఇప్పటి వరకు జరగని విధంగా ఈసారి ఎంపీ అభ్యర్థుల పోటీ ఉండబోతోంది. ఈ అంశాలను మీరు తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే...


సిట్టింగ్ లకే వైసీపీ సీటు...
ఏపీ వ్యాప్తంగా సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీలను వైసీపీ పార్టీ కొన్ని చోట్ల అవకాశం కల్పించింది. ఈసారి ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి మాత్రం పాత వారికే ఎంపీ అభ్యర్థులుగా మరోసారి బరిలో నిలిపింది. తిరుపతి పార్లమెంటు అభ్యర్థిగా డాక్టర్ ఎం గురుమూర్తి పోటీ చేస్తున్నారు. 2021లో జరిగిన  ఉప ఎన్నికల్లో ఆయన తిరుపతి నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆయనను సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థి గా తొలుత ప్రకటించిన.. సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలం తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన పార్టీ పై వ్యతిరేక స్వరం వినిపించి పార్టీ మారిపోవడంతో గురుమూర్తి ను తిరిగి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇక చిత్తూరు పార్లమెంటు అభ్యర్థిగా రెడ్డప్ప మరోసారి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా జీడీ నెల్లూరు కు ఆయనను ఎమ్మెల్యే గా ప్రకటించి.. అక్కడి ఎమ్మెల్యే నారాయణ స్వామిని చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన పోటీ చేయలేనని చెప్పడంతో తిరిగి చిత్తూరు ఎంపీ గా రెడ్డప్ప ను నియమించారు. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలు కలిసే రాజంపేట పార్లమెంట్ అభ్యర్ది గా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పోటీ చేయనున్నారు.


టీడీపీ కూటమి కొత్త వారికే అవకాశం 
టీడీపీ పార్టీతో బీజేపీ, జనసేన పార్టీ కూటమిలో భాగంగా పలు విధాలుగా మార్పులు జరిగాయి. ఇందులో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మూడు ఎంపీలకు గాను బీజేపీ రెండు సీట్లు, టీడీపీ ఒక సీటు కైవసం చేసుకుంది. తిరుపతి పార్లమెంటు అభ్యర్థిగా వైసీపీ నుంచి 2014లో ఎంపీగా, 2019లో గూడూరు ఎమ్మెల్యే గా గెలుపొందిన వరప్రసాద్ ఈసారి బీజేపీ పార్టీ నుంచి తొలిసారి తిరుపతి ఎంపీగా పోటీ చేస్తున్నారు. రాజంపేట ఎంపీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈసారి బీజేపీ నుంచి తొలిసారి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా చిత్తూరు ఎంపీగా దగ్గుమల్ల ప్రసాద రావు తొలిసారి పోటీ చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైసీపీ పార్టీలోని సిట్టింగ్ ఎంపీ లను గెలిపిస్తారో... కూటమి నుంచి పోటీ లో ఉన్న అభ్యర్థులను ఎంపీగా ఆశీర్వదిస్తారో తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడక తప్పదు.