ఏపీలో నేడు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీ నారాయణ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికెత్తేశారు. ఓ ప్రభుత్వ కార్యక్రమానికి అతిథిగా హాజరైన లక్ష్మీ నారాయణ సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించారు. ఏపీ ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన లక్ష్మీ నారాయణను ఆహ్వానించారు. ఈ ప్రభుత్వ కార్యక్రమంలో లక్ష్మీ నారాయణ మాట్లాడారు. 


ఈ సందర్భంగా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ.. విద్యా, వైద్య రంగాల్లో మంచి చేసేవారికి కచ్చితంగా ఫలితాలు కూడా బాగుంటాయని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు, జగనన్న ఆరోగ్య సురక్ష పథకాలు చాలా మంచివని అన్నారు. తాను చదువుకున్న పాఠశాల గత కొన్నేళ్లకి, ఇప్పటికీ చాలా మారిందని కొనియాడారు. ఇప్పుడు ఆ స్కూల్లో పిల్లలకు పౌష్ఠికాహారం బాగా అందుతోందని లక్ష్మీ నారాయణ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు అన్ని సౌకర్యాలతో సుందరంగా ముస్తాబయ్యాయని అన్నారు. 


జగనన్న సురక్ష కార్యక్రమం గురించి మాట్లాడుతూ.. సాధారణంగా ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వాలు ఒకరోజు మెడికల్ క్యాంపులు పెడుతుంటాయని, కానీ, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం రోజుల తరబడి క్యాంపులు కొనసాగించడం మంచిగా ఉందని కొనియాడారు. డాక్టర్లు నేరుగా వచ్చి మెడికల్ టెస్టులు చేసి అవసరమైన పరీక్షలు చేయడం అభినందనీయమని అన్నారు. స్కూలు పిల్లలకు రాగి జావ అందిస్తుండడం, మద్యాహ్నం భోజనం నాణ్యంగా ఉండేలా చూడటం కూడా అభినందనీయమని అన్నారు. 


తాజాగా లక్ష్మీ నారాయణ సీఎం జగన్‌ ప్రవేశపెట్టిన పథకాన్ని ఇలా పొగడడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొన్నేళ్ల క్రితం లక్ష్మీ నారాయణ సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ గా ఉన్న సమయంలో జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గతంలో వివిధ ఛానెళ్లకు, యూట్యూబ్ ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కూడా జగన్ వ్యక్తిత్వం, వైఖరి గురించి లక్ష్మీ నారాయణ పలు వ్యాఖ్యలు చేశారు.