Value of womans life is 5 lakh rupees RMP doctor in Anantapur | అనంతపురం: జ్వరం వచ్చిందని ఆర్.ఎం.పి డాక్టర్ వద్దకు పోతే సూది మందేసి చంపేశారు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం భూప సముద్రం గ్రామంలో ఆర్.ఎం.పి వైద్యుడు బోయ చిరంజీవి నిర్వాకం ఇది. బ్రహ్మసముద్రం మండలం రాయలూరి తాండకు చెందిన జ్యోతి బాయ్ అనే 31 ఏళ్ల మహిళకి సాధారణ సీజనల్ వ్యాధి... జ్వరంతో పాటు దగ్గు, జలుబు వచ్చింది. మందు బిల్లా.. సూది మందు వేసుకుంటే అంతా నయమైపోతుంది అనుకున్నారు తండా వాసులు. సూది మందు వేసేవాడు మందు, బిల్ల ఇచ్చేవాడు ఎంబిబిఎస్ డాక్టర్ అనుకునే అమాయకత్వం వారిది. ఈ అమాయకత్వపు ఆలోచనతోనే అరకొర విద్యను అభ్యసంచి ఆర్ఎంపి వైద్యుడిగా అవతారమెత్తిన బోయ చిరంజీవిని ఆశ్రయించింది. 


పేదల డాక్టర్‌గా చలామణి...


పేదల దగ్గర పెద్ద డాక్టర్ గా చలామణి అవుతున్న ఈ RMP చిరంజీవి పేషెంట్ జ్యోతి బాయ్ కి ఇంజెక్షన్ ఇచ్చాడు. గంటల వ్యవధిలో ఆ సూది మందు వికటించింది. జ్యోతి బాయ్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. బిత్తర పోయిన ఆర్ఎంపి వైద్యుడు చిరంజీవి వెంటనే కళ్యాణదుర్గం ఆర్ డి టి ఆసుపత్రికి పేషెంట్‌ను పంపించాడు. అక్కడ వైద్యులు కూడా చేతులు ఎత్తేశారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి ఆమెను రిఫర్ చేశారు. రెండు రోజుల ట్రీట్మెంట్ అనంతరం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కూడా తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తూ మెరుగైన వైద్యం కోసం కార్పొ"రేట్" ఆసుపత్రికి  వెళ్లాలని సూచించారు. 


నకిలీ మందుల ప్రయోగంతో మహిళ మృతి


బాధిత కుటుంబ సభ్యులు జ్యోతిబాయిని అనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.  ప్రాణాపాయ స్థితిలో అక్కడికి చేరుకున్న ఆమెను అనుభవజ్ఞులైన వైద్యులు మెరుగైన చికిత్స అందించినప్పటికీ జ్యోతిబాయ్ ప్రాణాలను నిలబెట్ట లేకపోయారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించింది. నకిలీ మందులు ఆమెపై ప్రయోగించడం వల్లే జ్యోతి బాయ్ మృతి చెందినట్లు అక్కడి  వైద్యులు నిర్ధారించారు. మెడికల్ మాఫియా... దళిత, గిరిజనులు,బడుగు బలహీన వర్గాల మారుమూల గ్రామాల ప్రజలను టార్గెట్ చేస్తూ తమ తమ కంపెనీల ఔషధ ప్రయోగాలను చేస్తుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి పావులుగా మెడికల్ షాపులను వాడుకుంటున్నారన్న సందేహాలు బలపడుతున్నాయి. 


పంచాయతీ పెట్టి మహిళ ప్రాణాలకు వెల కట్టి..


ఈ క్రమంలో బాధిత కుటుంబాలను కాంప్రమైజ్ చేసుకోవడానికి సంబంధిత ఆర్ఎంపి వైద్య బృందం ₹5 లక్షల రూపాయలకు పంచాయతీ పెట్టింది. 2 లక్షల నుంచి ప్రారంభమైన వారి తాయిలం చివరకు ₹5 లక్షలకు చేరింది. ప్రాణానికి ఖరీదు కడుతున్న అంశాన్ని ఆ తాండావాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. మందులు సరఫరా చేసిన సంబంధిత మెడికల్ ఏజెన్సీ ని, వారికి అన్ని అనుమతులు ఇచ్చిన అధికారులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబంతో పాటు గిరిజన, బంజారా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి.


Also Read:  TDP News: కోటి మంది టీడీపీ కార్యకర్తలకు కీలక సూచన - ఇవి గుర్తు పెట్టుకుంటే కుటుంబానికి రూ. 5 లక్షల ధీమా