Kurnool District SP | దేవనకొండ: కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలు జరుపుతున్నారన్న ప్రచారంపై పోలీసులు స్పందించారు. కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్ లో యురేనియం తవ్వకాలు జరగడం లేదని, వదంతులు, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ప్రజలకు సూచించారు. దేవనకొండ మండలంలోని కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ చుట్టుపక్కల గ్రామాలలో యురేనియం లభ్యత, పరిశోధన కోసం ఎలాంటి బోరు తవ్వకాలు జరగడం లేదని బుధవారం ఎస్పీ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని రిజర్వు ఫారెస్ట్ చుట్టుపక్కల గ్రామ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందవద్దని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని కర్నూలు ఎస్పీ బిందు మాధవ్ హెచ్చరించారు.
దామగుండం ఫారెస్టులో రాడార్ స్టేషన్
ఇటీవల తెలంగాణలో ఇలాంటి సమస్యే ఎదురైంది. వికారాబాద్ జిల్లాలోని దామగుండం అడవిలో భారత నౌకాదళం రాడార్ స్టేషన్ ఏర్పాటు చేసుకుంది. అయితే రాడార్ స్టేషన్ ఏర్పాటు చేస్తే సమీపం ప్రాంతాల ప్రజలకు అనారోగ్య సమస్యలు వస్తాయని, పర్యావరణం విషతుల్యం అవుతుందని ప్రజలు ఆందోళన చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం సైతం కేంద్రానికి సహకరించడంతో దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ లో రాడార్ స్టేషన్ కు ఇబ్బందులు తలెత్తలేదు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలంగాణకు వచ్చి అక్టోబర్ 15న రాడార్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం పాల్గొన్నారు.
ఇప్పుడు కర్నూలు జిల్లా ప్రజల్ని యురేనియం తవ్వకాల సమస్య ఆందోళనకు గురిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వం దేవనకొండ మండలంలోని కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ ప్రాంతంలో 468.25 హెక్టార్లలో 68 బోర్లు వేసేందుకు అనుమతి ఇచ్చింది. యురేనియం తవ్వకాలు చేపడితే పర్యావరణం దెబ్బతినడంతో పాటు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అనారోగ్య సమస్యలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. కప్పట్రాళ్ల రక్షిత అడవిలో యురేనియం తవ్వకాలను అడ్డుకుంటామని చుట్టుపక్కల దాదాపు 12 గ్రామాల ప్రజలు ఇటీవల నిరసనకు దిగారు. కొన్ని గ్రామాల్లో అయితే ఇతర గ్రామాల నుంచి ఎవరూ తమ గ్రామంలోకి రాకుండా రోడ్డు మీద రాళ్లు, కంచెలు అడ్డుపెట్టి స్వీయ నిర్బంధం చేసుకున్నారు.
Also Read: Pawan Kalyan: అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ - చర్చించిన అంశాలు ఇవే !
హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా దేవనకొండ మండలంలోని కప్పట్రాళ్ల చుట్టుపక్కల గ్రామాలు వ్యవసాయం చేస్తున్నాయి. కానీ యురేనియం తవ్వకాలకు కేంద్రం అనుమతి ఇవ్వడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఇటీవల కప్పట్రాళ్ల గ్రామాల ప్రజలు స్వీయ నిర్భంధం చేసుకుని రోడ్డుపై నిరసన తెలపగా, అధికారులు వచ్చి నవంబర్ 4న కలెక్టర్ వచ్చి మాట్లాడతారని చెప్పడంతో శాంతించారు. కప్పట్రాళ్ల, బేతపల్లి, గుండ్లకొండ, నెల్లిబండ, నేలతలమరి, పి.కోటకొండ, చెల్లెలచెలిమల, జిల్లేడు బుడకల, ఈదులదేవరబండ, బంటుపల్లి, మాదాపురం, దుప్పనగుర్తి గ్రామాల ప్రజలతో చెప్పిన ప్రకారం కలెక్టర్, ఉన్నతాధికారులు వెళ్లి వారితో చర్చించారు. యురేనియం కోసం బోర్లు వేయడం ద్వారా పర్యావరణం, నీరు దెబ్బతింటాయని స్థానికులు తీవ్ర అనారోగ్యం పాలవుతారని ఆందోళన చేస్తున్నారు.