కడప: దేశ వ్యాప్తంగా ఎన్నో రాజకీయ పార్టీలున్నా మహానాడు (Mahanadu) లాంటి కార్యక్రమంతో నేతలు ప్రజల మంచి చెడులపై చర్చించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. కడపలో జరుగుతున్న మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. గతంలో రాయలసీమలో మహానాడు అంటే తిరుపతిలో నిర్వహిచేవాళ్లం. ఇప్పుడు దేవుడి గడప కడప గడ్డమీద తొలిసారి జరుపుకుంటున్నాం. ఈ మహానాడు ఏపీ దశ దిశను మార్చేలా ఉండి, చరిత్ర సృష్టించబోతున్నాం. ఇప్పటివరకూ 34 మహానాడులు జరుపుకున్నాం. 2 మహానాడులు డిజిటల్ గా జరిగాయన్నారు.

Continues below advertisement


93 శాతం స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించాం..


గతంలో మహానాడు సమయంలో ఎండలతో వేడిగా ఉండేది. ఈ ఏడాది చల్లగా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతోంది. ఉమ్మడి కడపలో 10కి 7 స్థానాలు సాధించాం. ఈసారి మరింత కష్టపడితే పదికి పది స్థానాలు సాధిస్తాం. రాయలసీమ ప్రజలు చైతన్యంతో ఎన్నికల్లో ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ మహానాడును కడపలో పెట్టాం. 2024 ఎన్నికల్లో ప్రజలు 93 శాతం స్ట్రైక్ రేట్, 53 శాతం ఓట్లతో ప్రభంజనం సృష్టించాం. టీడీపీ కార్యకర్తల త్యాగాలు, పోరాటాలతో ఇది సాధ్యమైంది. ఎప్పటికప్పుడూ వ్యూహాత్మకంగా ఆలోచిస్తూ జనసేన, బీజేపీతో కలిసి ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ప్రతి గ్రామంలో కార్యకర్త పార్టీ జెండా మోయడంతోనే మన విజయం సాధ్యమైంది. 43 ఏళ్ల చరిత్రలో ఏ పార్టీ ఎదుర్కోని సంక్షోభాలు ఎదుర్కొన్నాం. మన పని అయిపోయిందన్న వారి పని అయిపోయింది. టీడీపీ జెండా ఎల్లప్పుడూ రెపలాడుతూనే ఉంటుంది. 


ఎన్టీఆర్ చైతన్య రథం నుంచి యువగళం వరకు..


నాటి ఎన్టీఆర్ చైతన్య రథం, నేను చేసిన వస్తున్నా మీకోసం పాదయాత్ర.. గత ఎన్నికల ముందు నారా లోకేష్ చేసిన యువగళం పాదయాత్ర వరకు టీడీపీ కార్యకర్తల్లో అదే పోరాట స్ఫూర్తి కనిపించింది. అటువైపు చూస్తే ఆ పార్టీ హత్యా రాజకీయాలు, దోపిడీలు. విధ్వంసక పాలన. అన్యాయాలపై పోరాడితే, ప్రశ్నిస్తే టీడీపీ నేతలు, కార్యకర్తల ప్రాణాలు తీశారు. వేటాడారు, వెంటాడారు. అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసినా వెనక్కి తగ్గకుండా పార్టీ జెండా మోసిన వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న. మన చంద్రయ్య పీక కోస్తున్నా కూడా జై తెలుగుదేశం అంటూ ప్రాణాలొదిలాడు. అలాంటి స్ఫూర్తి, ప్రశ్నించేతత్వం మనలో ఉండాలి. ఆశయ సాధన కోసం మరెందరో కార్యకర్తలు, నేతలు ఎన్నో త్యాగాలు చేశారు. మహానాడు వేదికగా కార్యకర్తలు అందరికీ శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా.



అభివద్ధి అంటే తెలుగుదేశం పార్టీ..
ప్రజల జీవితాల్లో ఇంతలా ప్రభావం చూపిన ఏకైక పార్టీ తెలుగుదేశం. తెలుగుజాతి సంక్షేమం, అభివద్ధి అజెండాగా 43 ఏళ్లు టీడీపీ కృషి చేస్తుంది. టీడీపీకి ముందు ఆ తరువాత అనేలా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని చూపించవచ్చు. పటేల్ పట్వారీ వ్యవస్థ, మహిళలకు ఆస్తిలో హక్కు, బాలికా విద్య నుంచి ప్రత్యేక మహిళా యూనివర్సిటీ వరకు, మిగులు విద్యుత్, రూ.2కు కిలో బియ్యం నుంచి పక్కా ఇళ్ల వరకు, రూ.30 పింఛన్ నుంచి రూ.4000 పింఛన్ వరకు, నిరుద్యోగం నుంచి ఐటీ ఉద్యోగాల వరకు.. రాయలసీమలో తాగునీటి సమస్యల నుంచి సిరులు పండించే వరకు ఎంతో చేసిన పార్టీ తెలుగుదేశం.’ అని చంద్రబాబు అన్నారు.