#Mahanadu2025Begins కడప: తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు కడపలో ఘనంగా ప్రారంభమైంది. మహానాడు సందర్భంగా కడప గడ్డ పసుపుమయంగా మారింది. టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో కడపకు తరలివెళ్తున్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు కడపలో మహానాడు (TDP Mahanadu 2025)కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదటి రెండు రోజులు టీడీపీ నేతల చర్చలు, కార్యక్రమాలు ఉంటాయి. మూడో రోజు 145 ఎకరాలలో సిద్ధం చేసిన స్థలంలో బహిరంగసభ జరగనుంది. పార్కింగ్ కోసం 450 ఎకరాలు కేటాయించారు. దేవుని గడప కడపలో మంగళవారం నాడు టీడీపీ మహానాడు ప్రారంభం సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు పార్టీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. 

Continues below advertisement


పరీక్షల్ని ఎదుర్కొన్న ప్రతిసారీ విజయం సాధించాం..


తెలుగుదేశం మహా పండుగ ‘మహానాడు’ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తుంగ తరంగంలా ఎగసిపడే ఉత్సాహం తెలుగుదేశం కార్యకర్తల సొంతం అన్నారు. ఉరకలేసే యువత తెలుగుదేశం ఆస్తి అని, తరతరాల తెలుగు ఖ్యాతిని జగద్విదితం చేయడం టీడీపీ పవిత్ర కర్తవ్యం అన్నారు. ప్రపంచ దేశాల్లో తెలుగు వారు ఎక్కడ ఉన్నా ఆ దేశానికే తలమానికంగా మారాలనేది మన సంకల్పంగా పేర్కొన్నారు.. అందుకే మనం నిరంతరం శ్రమిస్తున్నాం.  పరీక్షల్ని ఎదుర్కొన్న ప్రతిసారీ తెలుగుదేశం విజేతగానే నిలిచిందన్నారు చంద్రబాబు.






గడచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విశ్వరూప సందర్శనం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుపుకుంటున్న మహానాడును తొలిసారి కడపలో నిర్వహిస్తున్నాం. మహానాడు సందర్భంగా ప్రజా సేవకు పునరంకితమవుతూ ‘యువగళం’కు ప్రాధాన్యతనివ్వాలని, ‘అన్నదాతకు అండగా’ నిలవాలని, ‘స్త్రీ శక్తి’కి పెద్దపీట వేయాలని, ‘పేదల సేవలో’ నిరంతరం శ్రమించాలని, ‘తెలుగు జాతి విశ్వఖ్యాతి’ లక్ష్యాన్ని సాధించే దిశగా కార్యాచరణ ఉండాలని, ‘కార్యకర్తే అధినేత’గా మారాలనే నూతన మార్గదర్శకాలతో ఉత్సాహంతో ముందుకు సాగాలని…. అదే నా ఆశ, ఆకాంక్ష అని చంద్రబాబు పోస్ట్ చేశారు.






నారా లోకేష్ పోస్ట్..


విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన ముహూర్త బలం గొప్పదన్నారు నారా లోకేష్. కార్యకర్తలే పార్టీకి బలం, బలగం అని... ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎత్తిన పసుపు జెండా దించకుండా పోరాడే కార్యకర్తలు నిత్య స్పూర్తి అన్నారు. నేటి నుండి ప్రారంభం అవుతున్న పసుపు పండగ మహానాడుకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ లోకేష్ ఘన స్వాగతం పలికారు.