JC Prabhakar Reddy Serious Comments On TDP Leaders: తాడిపత్రి (Tadipatri) మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్(Muncipal Chairman) జెసి ప్రభాకర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) టికెట్లు ఇస్తేనే గెలిచిపోతామనే ఊహల్లో నేతలు ఉన్నారని అన్నారు. ఓటర్లు వెధవలు అనుకుంటే నాయకులే పెద్ద వెధవలు అవుతారని అన్నారు.


వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న ప్రచారం నేపథ్యంలో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు (Peddavaduguru)లో యువ చైతన్య బస్సు యాత్ర (Yuva Chaitanya Yatra)ను ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. గ్రామంలో ప్రజలను, రైతులను పలకరిస్తూ జేసీ తన యాత్ర సాగించారు. యువత, చిన్నారులు కనిపించిన చోట వారితో కలిసి నృత్యం చేస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపారు జేసీ ప్రభాకర్ రెడ్డి. చిన్నారులకు చాక్లెట్లు పంచారు. డ్యాన్సులు వేస్తూ కేడర్ లో జోష్ నింపారు. యాత్రలో భాగంగా  ఓ మహిళతో మాట్లాడిన జేసీ ప్రభాకర్ రెడ్డి...ఆమె మాటలకు తొడ కొట్టారు. తర్వాత ఆ మహిళ సైతం తెలుగుదేశం పార్టీని గెలిపిస్తామంటూ తొడకొట్టారు. పలువురు మహిళలు, గ్రామస్తులు జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు గ్రామంలో పాదయాత్ర చేశారు.


టికెట్ల సంగతి త్వరగా తేల్చేస్తే మేలు
చంద్రబాబు నాయుడు టికెట్ల విషయం తొందరగా తేల్చేస్తే మేలని అన్నారు.  అభ్యర్థులు ఎవరు తేల్చడం ద్వారా నేతలు కూడా ప్రజల్లో తిరగడానికి వీలుంటుంది అన్నారు. టికెట్లు రాని అభ్యర్థులకు బుజ్జగింపులు...కేవలం 2024 ఎన్నికల్లో మాత్రమే చెల్లుతాయన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. 2029 ఎన్నికల్లో ఇవన్నీ చెల్లవని జోస్యం చెప్పారు. నిత్యం ప్రజల మధ్య ఉన్నవాడే నిజమైన నాయకుడని...నాయకుడు అనే వాడు టికెట్ ఇస్తేనే జనాల్లో తిరగడం కాదన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. యాత్రలో భాగంగా ప్రతి గ్రామంలోని ప్రజల సమస్యలు తెలుసుకుని, ప్రతి గ్రామానికి ప్రత్యేక మేనిఫెస్టోను తయారు చేస్తామన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. 175 నియోజకవర్గాలకు సంబంధించిన మేనిఫెస్టోను...తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేస్తుందన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలపై నేతలే మేనిఫెస్టో తయారు చేసుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 


రైతులకు శ్రమ తగ్గిస్తామని హామీ 
యువతకు సముచిత గౌరవం ఇవ్వాలన్నదే తెలుగుదేశం పార్టీ లక్ష్యమనన్నారు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి. యువతను గౌరవించిన పార్టీలకే మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు. అందుకోసం సొంతంగా మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ఎక్కడి ఉత్పత్తులు అక్కడే కొనే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తమ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. నియోజకవర్గంలో రైతులు పండించే ఉత్పత్తులను ఎక్కడికక్కడ కొనుగోలు చేయించి...రైతులకు శ్రమ తగ్గిస్తామని హామీ ఇచ్చారు. చేనేతలు ఎక్కువగా ఉన్న యాడికి మండలంలో పట్టువస్త్రాల మార్కెటింగ్‌ వ్యవస్థను తీసుకొస్తామని హామీ ఇచ్చారు.  


Also Read:ముద్రగడ టు వంగవీటి - కాపు నేతలపై ఆపరేషన్ ఆకర్ష్‌లో తడబడుతున్న వైసీపీ !