Raptadu MLA Paritala Sunitha News | రాప్తాడు: ప్రజలు మన పార్టీ మీద, మనపై ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు మాజీ మంత్రి పరిటాల సునీత. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ఎక్కడ తేడా ఉన్నా.. ఉపేక్షించేది లేదని టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. అనంతపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆమె ముఖ్య నేతలతో సోమవారం నాడు సమావేశం నిర్వహించారు. రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, రేషన్ పంపిణీ, పంటల సాగు తదితర అంశాల గురించి ఆరా తీశారు. గ్రామాల్లో నిర్మించబోయే సీసీ రోడ్లు, ఇతర పనుల విషయాలపై ఆరా తీశారు. ఎక్కడైనా సరే లోటు పాట్లు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకుని రావాలని సూచించారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడే సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు. 


ఈ క్రాప్ నమోదుపై ఫోకస్ చేయాలన్న ఎమ్మెల్యే


ప్రస్తుతం పొలం పిలుస్తోంది ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. రైతులు ఎలాంటి పంటలు సాగు చేస్తున్నారు. ఈ సమయంలో ఈ క్రాప్ నమోదు వంటి అంశాల మీద దృష్టి సారించాలని పరిటాల సునీత సూచించారు. రైతులకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహాకాల గురించి ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. మరోవైపు గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ రేషన్ సక్రమంగా అందాలన్నారు. లబ్ధిదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు ఉండకూడదన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో మన పార్టీని గెలిపించారని.. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉందని నాయకులతో సునీత అన్నారు.


Also Read: బుడమేరులో అక్రమ నిర్మాణాలపై, హైడ్రాపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు