Kurnool News: కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి మండలం మల్లేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నాగేశ్వర రావు, లక్ష్మీదేవి దంపతులు. అయితే వీరికి ఇద్దరు కుమారుడు కూడా ఉన్నారు. ఇంతకాలం పాటు కడుపున పుట్టిన పిల్లల కోసమే వీరు కష్టపడుతూ వచ్చారు. తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆస్తితో పాటు మరికొంత కూడా సంపాధించారు. ఉన్నదాంట్లో కుమారులను బాగా చూసుకున్నారు. ఇద్దరికీ పెళ్లిళ్లు చేశారు. వారికి కూడా పిల్లలు పుట్టారు. ప్రస్తుతం ఈ దంపతులకు వయసు మీదకు వచ్చింది. అయితే ఆస్తి మాత్రం వీరి పేరిటే ఉంది. వీరి వద్ద నుంచి ఎలాగైనా ఆస్తి అంతా అన్నకు ఇవ్వకుండా తానొక్కడే కొట్టేయాలనుకున్నాడు చిన్న కుమారుడు తిప్పరాజు. ఈక్రమంలోనే అద్భుతమైన ప్లాన్ వేశాడు. కన్నవాళ్లను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి బదులుగా కిడ్నాప్ చేయాలనుకున్నాడు. 






తనకు తెలిసిన వాళ్ల ద్వారా కిడ్నాపర్లకు సుపారీ ఇచ్చాడు. తన తల్లిదండ్రుల ఇద్దరినీ కిడ్నాప్ చేయమని చెప్పాడు. అయితే ఇందుకోసం ముహూర్తం కూడా ఫిక్స్ చేశాడు. అయితే అదే రోజు స్థానిక పోలీసులు పల్లె నిద్ర కోసం వచ్చారు. అది తెలియని కిడ్నాపర్లు వృద్ధ దంపతులను తీసుకెళ్తుండగా గమనించి వారిని కాపాడారు. నిందితులను గట్టిగా ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నాగేశ్వర రావు లక్ష్మీదేవి దంపతుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారి చిన్న కుమారుడు తిప్పరాజును పిలిపించి మాట్లాడుతున్నారు.