Kadiri Narasimha Swamy Temple: దేవాలయాలలోని నంది విగ్రహాలు పాలు తాగుతున్నాయన్న వార్తలు ఈమధ్య ట్రెండ్ అయ్యాయి. వీడియోలు గమనిస్తే.. భక్తులు అందిస్తున్న పాలు, నీళ్లను నందులు తాగినట్లుగా కనిపిస్తోంది. ఈ వార్తలు విని భక్తులు ఆలయాలకు చేరుకుని పెద్దఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి వార్తలు ఎక్కడో ఓ చోట ఏదో ఒక టైంలో  మనం వింటూనే ఉంటాం. కానీ అందుకు భిన్నంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి నరసింహస్వామి వారి వక్షస్థలం నుంచి స్వేద బిందువులు నేటికీ వస్తున్నాయంటే నమ్ముతారా..?


స్వామి వారికి అభిషేకం చేసిన తరువాత నుంచి వక్షస్థలంలో స్వేదబిందువు కనిపిస్తూనే ఉంటాయట. వీటిని ఆలయ అర్చకులు ఎప్పటికప్పుడు తొలగిస్తూనే ఉంటారట. ఈ వింత జరుగుతున్నది మరెక్కడో కాదు అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో వెలసిన శ్రీ కదిరి నరసింహ స్వామి ఆలయం (Sri Lakshmi Narasimha Swamy Temple)లో.  శ్రీవారి మూల విరాట్ వక్షస్థలం నుంచి ఇప్పటికీ చిరు స్వేద బిందువులు వస్తూనే  ఉంటాయన్నది ఇక్కడి ఆలయ అర్చకులు చెబుతున్నారు. సరే అయితే ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందామా..


అనంతపురంలో చారిత్రక ఆలయం.. 
అనంతపురం జిల్లాలోని కదిరి పట్టణం లో వెలసిన శ్రీ ఖాద్రి నరసింహ స్వామి దేవాలయం క్రీ.శ. 1332 సంవత్సరంలో నిర్మితమైనట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఎత్తయిన 4 రాజ గోపురాలు.. చుట్టూ ప్రాకారం,  మధ్యలో స్వామి వారి గర్భగుడి ఉంటాయి. శ్రీ విష్ణుమూర్తి నాల్గవ అవతారమైన నరసింహ స్వామి స్వయంభువుగా ఇక్కడ వెలిశాడంటూ చరిత్ర చెబుతోంది. ఉగ్ర నరసింహుడు హిరణ్యకశిపుడిని సంహరిస్తున్న ఆకారంలో నరసింహస్వామి భక్తులకు దర్శనం ఇస్తుంటారు. గర్భగుడిలో భక్త ప్రహ్లాదుడి సమేతంగా స్వామి వారు దర్శనం ఇవ్వడం ఇక్కడ మరో ప్రత్యేకత.


శ్రీదేవి భూదేవిల విరాట్టులు గర్భగుడికి కుడి పక్కన మరో ఆలయంలో కొలువై ఉంటారు. స్వామివారి మూర్తి ని ప్రాతః కాలమే అభిషేకిస్తారు. అనంతరం స్వామివారి వక్షస్థలం నుంచి చిన్నపాటి స్వేద బిందువులు ప్రత్యక్షమై నిరంతరం వస్తూనే ఉంటాయని ఆలయ అర్చకులు చెబుతారు. ఇలాంటి వింత దేశంలోనే మరెక్కడా లేకపోవడం విశేషం. ఆలయ నిర్మాణం చాళుక్యుల కాలంలో మొదలుపెట్టగా విజయనగర సామ్రాజ్య కాలంలో పూర్తి అయినట్టు చరిత్ర కారులు చెబుతున్నారు. ఇంతటి చరిత్ర ఉన్న ఆలయాన్ని మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ, విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు సందర్శించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. స్వామివారి ప్రధాన ఆలయంతోపాటు నాలుగు ఉపాలయాలని ఖాద్రి సన్నిధిలో చూడవచ్చు. అలాగే ప్రధాన ఆలయానికి ఈశాన్యంలో పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించి అనంతరం స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీ.


పక్షం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు 
ఆలయ ప్రాంగణంలోనే కళ్యాణ మంటపం, పాకశాల, యాగశాల, ఆస్థాన మండపాలు నిర్మించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివార్ల ఉత్సవమూర్తులను ఆస్థాన మండపంలో కొలువుదీర్చి భక్తుల దర్శనార్థం ఉంచడం సాంప్రదాయం. ఇక్కడ పక్షం రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఏటా ఫాల్గుణ మాసం బహుళ పౌర్ణమి నాడు స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవం నిర్వహిస్తారు. రథోత్సవాన్ని కనులారా తిలకించేందుకు రాష్ట్రంతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తజనం తరలివస్తారు. సుమారు రెండు లక్షల మంది రథోత్సవాన్ని తిలకించి తరించేందుకు వస్తారనేది ఒక అంచనా.


కదిరి కి రోడ్డు మార్గాలతో పాటు రైల్వే స్టేషన్ కూడా ఉండటంతో ఏ ప్రాంతం నుంచైనా స్వామివారి దర్శనార్థం ఈ చోటుకి చేరుకోవచ్చు. స్వామివారి పాదం మోపిన కొండ కావడంతో ఖాద్రీశుడని, అక్కడున్న కారడవికి అధిపతిగా ఉండడంతో కాటమరాయుడు అన్న నామాలతో స్వామి వారిని కొలుస్తారు.


వింత సంప్రదాయం... (Sri Lakshmi Narasimha Swamy Temple In Kadiri)
రథోత్సవం సమయంలో  మిరియాలు, దవణం‌, పండ్లను భక్తులు రథం పైకి చల్లుతారు. రథంపై నుంచి కింద పడిన వీటిని ప్రసాదంగా భావించి స్వీకరిస్తారు. తద్వారా సర్వ రోగాలు హరిస్తాయని భక్తుల విశ్వాసం. అలాగే స్వామి కృపాకటాక్షాలు ఎల్లవేళలా తమపై ఉంటాయన్న ప్రగాఢ విశ్వాసము భక్తులలో కానవస్తాది.