Temple chariot set on fire in Anantapur district | అనంతపురం: దేవుడి రథానికి నిప్పు పెట్టిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. హనకనహాల్ గ్రామంలోని శ్రీ రామాలయం దేవాలయానికి సంబంధించిన ఉత్సవ విగ్రహాలు పెట్టి ఊరేగించే రథానికి కొందరు దుండగులు నిప్పు పెట్టడం గ్రామంలో కలకలం రేపింది. రథం దగ్ధం చేసిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విచారణకు ఆదేశిస్తూ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా అధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని ఆదేశించిన చంద్రబాబు.. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడూ తనకు తెలియజేయాలని ఆదేశించారు.
అసలేం జరిగిందంటే..
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం లోని కనేకల్ మండలం హనకనహాల్ లో సెప్టెంబర్ 23న అర్ధరాత్రి శ్రీ రామాలయం రథానికి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. రథం ఉన్న చోట నుంచి మంటలు ఎగిసి పడుతుండడం గమనించిన గ్రామస్తులు పెద్దగా కేకలు వేసుకుంటూ రథం వద్దకు వెళ్లి మంటలను ఆర్పారు. గ్రామస్తులు అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో రథం అప్పటికే సగానికి పైగా కాలిపోయింది. వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. రతాన్ని ఎందుకు కాల్చాల్సి వచ్చిందని, గ్రామస్తులు ఈ ఘటనకు పాల్పడ్డారా లేక బయట నుంచి వచ్చిన వారు ఈ పని చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి కుట్ర అనే అనుమానంతో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాలతో హనకనహాల్ గ్రామంలో కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు, రాయదుర్గం సీఐలు వెంకటరమణ, జయ నాయక్ ప్రత్యేక బృందంతో వెళ్లి ఘటన స్థలాన్ని పరిశీలించారు. రథం కాలిన ప్రదేశంలో పోలీసులకు విలువైన సమాచారం దొరికినట్లు తెలుస్తోంది. ఆ సమాచారం ఆధారంగా నిందుతుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు పోలీసులు చేపట్టారు.అనంతపురం నుంచి నిందితుల వివరాలు సేకరించడానికి డాగ్ స్క్వాడ్, క్లోస్ టీమ్లను రప్పిస్తున్నట్లు కళ్యాణదుర్గం డిఎస్పి రవిబాబు పేర్కొన్నారు. ఈ ఘటనలో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Also Read: Tirumala Laddu Row: తిరుమల లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం - టీటీడీ కీలక ప్రకటన