Nandyal MP Byreddy Shabari comments on Adulterated Ghee used at Tirumala Laddu Prasadam | నంద్యాల: ల్యాబ్ లో సాక్ష్యాధారాలతో సహా నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారన్న విషయం బట్టబయలైనా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ తీరులో మార్పు రాలేదని, తిరుపతి లడ్డూలో కొవ్వు అనేది కట్టుకథ అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. జగన్ గారూ.. ల్యాబ్ నివేదికలు కూడా కట్టుకథలా? జంతువుల అవశేషాలు కట్టుకథలా? చేప నూనె, పందికొవ్వు ఉండడం కట్టుకథా? కట్టుకథలు చెప్పడం ఒక్క జగన్ రెడ్డికే చెల్లిందని నంద్యాల ఎంపీ, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి ఎద్దేవా చేశారు.
లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన ఘనత మీదే
పాపాలను కడిగేవాడు, కోరిన కోర్కెలు తీర్చేవాడు తిరుమల తిరుపతిపై కొలువుదీరిన శ్రీనివాసుడు అన్నారు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో వెంకటేశ్వర స్వామిని భక్తులు దర్శించుకుంటారు. అలాంటి స్వామి లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేసిన ఘనత మీకు (జగన్‌కు) దక్కింది. హిందువులు గోమాతను దేవతగా కొలుస్తారని, దేవుడితో సమానమైన గోమాంసం నూనెను లడ్డూలో వాడడం దుర్మార్గం, అత్యంత పాపం అన్నారు. ఈ పాపం జగన్మోహన్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వానిదేనని ఆమె ఆరోపించారు. హిందుత్వాన్ని నమ్మనివాళ్లు హిందువులు కాని వాళ్లు అయిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వారిని టీటీడి చైర్మన్ గా అప్పటి సీఎం జగన్ రెడ్డి నియమించడమే అతిపెద్ద తప్పిదమని ఎంపీ బైరెడ్డి శబరి విమర్శలు చేశారు.
శ్రీశైలం లడ్డూలో చికెన్ ఎముక అని చెబితే ఎవరూ నమ్మలేదు
వెంకటేశ్వరస్వామి ఓ నల్లరాయి అని, ఏడు కొండలు ఎందుకు? ఐదు కొండలు చాలు అని చెప్పి ఒక జీఓను వైసీపీ ప్రభుత్వం తెచ్చిందని ఈ సందర్భంగా టీడీపీ ఎంపీ శబరి గుర్తు చేశారు. 1857లో సిపాయిల తిరుగుబాటు సమయంలో బ్రిటీషు వాళ్లు వాడే బుల్లెట్లకు గోమాంసం ఉందని తెలిసి బ్రిటీషు వారిపై విపరీతమైన తిరుగుబాటు మొదలైన ఘట్టం భారతదేశ చరిత్రలో ఉంది. శ్రీశైలం లడ్డూలో చికెన్ ఎముక వైసీపీ పాలనలో కనిపించిందని తాను చెబితే ఎవరూ పట్టించుకోలేదన్నారు. దేవాలయాలు ఇంకా ఎందుకున్నాయి? మన దేవుళ్లు ఎందుకు ఉన్నారు? అని నాకు అనిపిస్తోంది. తిరుమల లడ్డూను కల్తీ చేసిన వారిని ఉరితీసినా తప్పుకాదని మండి పడ్డారు.