Byreddy On Upper bhadra :  కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న ఎగువభద్ర ప్రాజెక్ట్  నిర్మితమైతే సీమ ఎడారిగా మారడం ఖాయమని రాయలసీమ స్టీరింగ్‌ కమిటీ చైర్మన బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.  నికర జలాల పరిరక్షణ కోసం బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద నుండి మహా పాదయాత్ర చేపట్టారు. రైతులు, ప్రజా ప్రతినిధులు, ప్రజా, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, ప్రజలు ఆయన వెంట నడిచారు.ఎగువ భద్ర ప్రాజెక్ట్‌పై సీమ ప్రాంత ఎమ్మెల్యేలు నోరు విప్పకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. అప్పర్‌ భద్ర ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపడితే రాయలసీమ ప్రాంతం సాగు, తాగు నీరు అందక ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 


తుంగభద్ర డ్యామ్‌ నుంచి హెచఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ కాలువలకు తాగునీరు వస్తున్నా.. పై భాగంలో అప్పర్‌ భద్ర ప్రాజెక్ట్‌ నిర్మించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. కృష్ణ బ్యారెజ్‌పై తీగల వంతెనకు బదులు బ్రిడ్జి కం బ్యారేజ్‌ నిర్మించాలని కోరారు. ఆర్డీఎస్ ఆనకట్ట నిర్మితమైతే కర్నూలు జిల్లా రైతులకు నికర జలాలు. అందుతాయి అన్న విషయాన్ని గుర్తు చేశారు. మూడు రోజుల పాటు పాదయాత్ర సాగనుంది.  28న ఆదోనిలో భారీ ప్రదర్శనతో ప్రధర్శనను ముగించనున్నారు.  రాజకీయ భవిష్యత్తు ముఖ్యం కాదని, రాయలసీమ ప్రజల బతుకే ముఖ్యమని ..  మార్చి మొదటి వారంలో రాయలసీమలోని 52 నియోజకవర్గాల్లో ఎగువ భద్రకు వ్యతిరేకంగా ప్రజల నుంచి సంతకాల సేకరించి ప్రధానికి పంపుతామని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చెబుతున్నారు. 


తుంగ, భద్ర నదుల ద్వారా వచ్చే నీటిని తుంగభద్ర డ్యామ్‌లో నిల్వ చేసి అక్కడి నుండి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతో పాటు, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రాలకు దామాషా ప్రకారం పంపిణీ జరిగింది. కర్ణాటకలో ప్రస్తుతం భద్రావతి నది పై భాగాన కర్ణాటక పశ్చిమ ప్రాంతంలో ‘అప్పర్‌ భద్ర’ మేజర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. తుంగ, భద్ర నదుల నుండి నీటిని తోడుకోవడం ద్వారా కర్ణాటక లోని వెనుకబడిన చిత్రదుర్గ, చిక్‌మగళూరు, దావణగెరె, తుముకూరు జిల్లాల్లో దాదాపు 2,25,515 హెక్టార్లకు సాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్టును డిజైన్‌ చేశారు.  ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విన్నవించడం, కేంద్రం ఆమోదించడం జరిగింది. కృష్ణా బేసిన్‌లో భాగంగా వున్న తుంగభద్ర డ్యామ్‌పై దిగువనున్న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల అభిప్రాయాలను, అభ్యంతరాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. 


రెండు దశల్లో పూర్తి చేయనున్న ఈ ప్రాజెక్టు ద్వారా మొదటి దశలో 17.4 టీఎంసీలు, రెండవ దశలో 29.9 టిఎంసీల నీటిని కర్ణాటక తుంగభద్ర డ్యామ్‌ లోకి రాకుండా తోడేసుకుంటుంది. ఆ మేరకు దిగువనున్న హెచ్‌ఎల్‌సి, ఎల్‌ఎల్‌సి, పోతిరెడ్డిపాడు, రాజోలి బండ డైవర్షన్‌ స్కీమ్‌ కింద వున్న ఆయకట్టు పూర్తిగా నష్టపోతుందని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్ర అభ్యంతరాలు పెట్టాయి. అయితే ఈ అభ్యంతరాలను కర్ణాటక  ప్రభుత్వం పట్టించుకోవడం  లేదు.  ‘అప్పర్‌ భద్ర’ నిర్మాణానికి సిద్ధమైంది. జాతీయ  హోదా ప్రకటించి నిధులు కూడా విడుదల చేయడంతో  రాయలసీమ రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది.